Red Light Therapy: రెడ్‌లైట్ థెరపీతో మధుమేహానికి అడ్డుకట్ట.. గణనీయంగా తగ్గుతున్న చక్కెర నిల్వలు!

Study Says Red Light Therapy Can Lower Blood Sugar Levels
  • లండన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
  • ఎల్‌ఈడీ లైట్లలోని నీలిరంగు కాంతి కారణంగా పెరుగుతున్న ముప్పు
  • నీలం రంగు కాంతితో రక్తంలో చక్కెర స్థాయుల్లో అసమతౌల్యత
  • రెడ్‌లైట్‌తో మైటోకాండ్రియా ఉత్తేజితమై శక్తి విడుదల
  • విడుదల శక్తితో గ్లూకోజ్ వినియోగం
చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ పట్టిపీడిస్తున్న మధుమేహానికి ‘రెడ్‌లైట్ థెరపీ’(ఎరుపు రంగు కాంతి)తో అడ్డుకట్ట వేయొచ్చని తాజా అధ్యయనం ఒకటి నిరూపించింది. భోజనం తర్వాత మన శరీరంపై 15 నుంచి 45 నిమిషాలపాటు ఎరుపురంగు కాంతి పడేటట్టు చేయడం ద్వారా మధుమేహానికి అడ్డుకట్ట వేయొచ్చని లండన్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు.  ‘బయోఫోటోనిక్స్’ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.

రెడ్ లైట్ థెరపీ ద్వారా మైటోకాండ్రియాలో 670 నానోమీటర్ల ఉత్తేజిత శక్తి (స్టిమ్యులేటెడ్ ఎనర్జీ)ని ఉత్పత్తి చేయగలిగితే అది గ్లూకోజ్ వినియోగానికి దారితీస్తుందని తేలింది. మరీ ముఖ్యంగా గ్లూకోజ్ తీసుకున్న తర్వాత 27.7 శాతం గ్లూకోజ్ స్థాయులు తగ్గినట్టు కనుగొన్నారు. గరిష్ఠంగా గ్లూకోజ్ పెరుగుదలను 7.5 శాతం తగ్గించింది.  

శరీరంపై ఎరుపురంగు కాంతి పడగానే జీవకణంలోని మైటోకాండ్రియా ఉత్తేజితమై వెంటనే శక్తిని విడుదల చేయడం మొదలుపెడుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ మైఖేల్ పానర్ పేర్కొన్నారు. భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయులు అమాంతం పెరగకుండా ఇది అడ్డుకుంటుందని వివరించారు. ఎల్ఈడీ లైట్లలో నీలిరంగు (బ్లూ లైట్) కాంతి ఆరోగ్యానికి హాని చేస్తుందని, నీలంరంగు కాంతికి శరీరం ఎక్కువసేపు గురికావడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయులు డిస్ రెగ్యులేషన్‌కు గురవుతాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎల్ఈడీ లైట్ల వినియోగం పెరగడంతో ఈ ముప్పును గుర్తించాలని సూచించారు.
Red Light Therapy
Blood Sugar
Diabetes
Diabetic
Health

More Telugu News