Revanth Reddy: కావాలనే కరెంట్ కట్ చేస్తున్నారని మాకు సమాచారం ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం
- ఉద్దేశపూర్వకంగా కోత విధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో కావాలనే విద్యుత్ కోతలు పెడుతున్నారన్న సమాచారం తమకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించే ఆ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సాంకేతిక లోపాలు, ప్రకృతిపరమైన కారణాలు మినహాయించి... ఎక్కడైనా సరైన కారణం లేకుండానే విద్యుత్ సరఫరా నిలిచిపోతే అందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బంది చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఎక్కడా కోతలు విధించడంలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మునుపటితో పోల్చితే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని చెప్పారు. అయినప్పటికీ విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని అన్నారు.
ఏదైనా మరమ్మతుల నిమిత్తం విద్యుత్ నిలిపివేయాల్సి వస్తే, ఆయా సబ్ స్టేషన్ల పరిధిలో ముందుగానే సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. ఏ ప్రాంతంలోనైనా ఐదు నిమిషాలకు మించి విద్యుత్ సరఫరా నిలిచిపోతే, అందుకు గల కారణాలను సమీక్షించుకోవాలని పేర్కొన్నారు.