Nara Bhuvaneswari: తన కోసం రోడ్డు పక్కన ఎదురుచూస్తున్న వృద్ధులను ఆప్యాయంగా పలకరించిన నారా భువనేశ్వరి
- పూతలపట్టు నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
- భువనేశ్వరి కోసం ఓపిగ్గా ఎదురుచూసిన ఇద్దరు వృద్ధులు
- వారి కళ్లలో ఆనందం నింపిన నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు పూతలపట్టు నియోజకవర్గంలో 'నిజం గెలవాలి' కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ఐరాల మండలం చింతగుంపలపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం నారా భువనేశ్వరి కారులో వెళుతుండగా... రోడ్డు ప్రక్కనే ట్రాలీ కుర్చీలో తన కోసం ఆశగా ఎదురుచూస్తున్న రామచంద్రనాయుడు అనే వృద్దుడిని గమనించారు. వెంటనే ఆగి ఆ వృద్ధుడ్ని పలకరించారు.
పక్షవాతంతో మంచాన పడిన ఆ వృద్ధుడు ఎన్టీఆర్ కుమార్తె వస్తుందని తెలుసుకుని, ఆమెను చూడాలని కోరడంతో అక్కడకు తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు వివరించారు. ఆ వృద్దుని వద్దకు వచ్చిన భువనేశ్వరి, చేయి పట్టుకుని... "ఏం పెద్దాయన...బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంటోంది? ఆరోగ్యం జాగ్రత్త... ఏమైనా అవసరమైతే మన పార్టీ నాయకులను మీకు అందుబాటులో ఉండమని చెబుతా... వెళ్లొస్తాను" అంటూ కాసేపు ఆ వృద్ధునితో ముచ్చటించారు.
ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబునాయుడు అర్ధాంగి తనను గమనించి ఆగడమే కాకుండా, తనతో మాట్లాడడంతో ఆ వృద్ధుని కళ్లల్లో ఆనందానికి అవధులు లేవు.
అదేవిధంగా దారిమధ్యలో మరో వృద్ధురాలు లేవలేని స్థితిలో ఉండి భువనేశ్వరిని చూడాలని కుటుంబ సభ్యుల వద్ద పట్టుపట్టడంతో వారు రోడ్డుప్రక్కన ఓ కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి ఎదురు చూశారు. ఇది గమనించిన భువనేశ్వరి వెంటనే ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లారు.
ఆ వృద్ధురాలు భువనేశ్వరిని ఆప్యాయంగా చేయి పట్టుకుని పలకరించి... "బాగున్నావా అమ్మా!" అని పలకరించారు. అందుకు భువనేశ్వరి స్పందిస్తూ... "బాగున్నాను అమ్మా... మీరు బాగున్నారా? ఆరోగ్యం బాగుంటోందా? ఆరోగ్యం జాగ్రత్త" అని కాసేపు ముచ్చటించారు. భువనేశ్వరి పరామర్శతో ఆ వృద్ధురాలిలో ఆనందం వెల్లివిరిసింది.