Lasya Nanditha: లాస్య నందిత రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో వివరించిన పోలీసులు
- ఓఆర్ఆర్ పై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం
- కారులో వెళుతూ దుర్మరణం పాలైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే
- కేసు నమోదు చేసుకున్న పటాన్ చెరు పోలీసులు
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై సుల్తాన్ పూర్ వద్ద ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను కబళించింది. ఈ ఘటన జరిగిన ప్రదేశం పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో, కేసు నమోదు చేసుకున్న పటాన్ చెరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే కారుకు ప్రమాదం జరగడానికి దారితీసిన పరిస్థితులను గుర్తించారు.
దీనిపై పోలీసులు స్పందిస్తూ... ఎమ్మెల్యే లాస్య నందిత నిన్న సదాశివపేటకు వెళ్లొచ్చారని, నేటి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ఇంటి నుంచి బయటికి వచ్చారని వెల్లడించారు.
"ఎమ్మెల్యే లాస్య నందిత కారు షామీర్ పేట వద్ద అవుటర్ రింగ్ రోడ్డులోకి ప్రవేశించింది. ఓఆర్ఆర్ పై కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత ఎగ్జిట్ అయ్యే సమయంలో ప్రమాదం సంభవించింది. ముందు వెళుతున్న టిప్పర్ ను ఎమ్మెల్యే కారు బలంగా ఢీకొట్టింది. అనంతరం కారు అదుపుతప్పి రోడ్డు పక్కన రెయిలింగ్ ను ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు, అంతర్గత రక్తస్రావంతో లాస్య నందిత మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు" అని పోలీసులు వివరించారు.