TDP Janasena: కాసేపట్లో టీడీపీ-జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్.. 65 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశం
- ఉదయం 11.40 గంటలకు తొలి జాబితా విడుదల
- జాబితాలో 50 మంది టీడీపీ, 15 మంది జనసేన అభ్యర్థులు ఉండే అవకాశం
- చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్న సీనియర్ నేతలు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ - జనసేన కూటమి ఈరోజు తమ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తోంది. తొలి జాబితాలో 65 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. 65 మంది ఎమ్మెల్యేలలో 50 మంది టీడీపీ, 15 మంది జనసేన అభ్యర్థులు ఉండవచ్చని సమాచారం. ఈరోజు మంచి రోజు (మాఘ పౌర్ణమి) కావడంతో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. ఉదయం 11.40 గంటల సమయంలో జాబితాను విడుదల చేయనున్నట్టు సమాచారం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి జాబితాను విడుదల చేస్తారు.
మరోవైపు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు తదితర సీనియర్ నేతలు ఇప్పటికే చేరుకున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు, భీమవరం నుంచి పవన్ కల్యాణ్, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, మంగళగిరి నుంచి నారా లోకేశ్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నారు. మరోవైపు తొలి జాబితా విడుదలవుతున్న నేపథ్యంలో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. పొత్తులో భాగంగా పలువురు టీడీపీ ముఖ్య నేతలకు టికెట్ దక్కకపోయే అవకాశం ఉంది.