Sajjala Ramakrishna Reddy: పవన్ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు... 24 సీట్లకు దిగజారిపోయారా?: సజ్జల
- టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటన
- జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు
- 24 స్థానాల్లో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలరా అని ప్రశ్నించిన సజ్జల
- జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే నిర్ణయిస్తారా అంటూ వ్యాఖ్యలు
- పవన్ కు తాను పోటీ చేసే స్థానంపైనే స్పష్టత లేదని ఎద్దేవా
టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు. ఈ జాబితా చూస్తుంటే పవన్ కల్యాణ్ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం అర్థమవుతోందని అన్నారు.
24 స్థానాలతో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలనని అనుకుంటున్నారా? అని సజ్జల ప్రశ్నించారు. కనీసం ఆ 24 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఉన్న పవన్ ను చూస్తే జాలేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు.
గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కు ఈసారి కనీసం తాను పోటీ చేసే స్థానంపై కూడా స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. మిగిలిన స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే ఉంటారని, పవన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుందని సెటైర్ వేశారు.
"పవన్ ను అభిమానించే వాళ్లు ఇకనైనా ఆలోచించాలి. చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇస్తున్నాడో పవన్ చెప్పలేకపోతున్నాడు. ఇటీవలి వరకు ఎన్నో మాటలు చెప్పిన పవన్ ఇప్పుడెందుకు దిగజారిపోయారు? జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే నిర్ణయిస్తారా? ఓ రాజకీయ పార్టీని నడిపే లక్షణాలు పవన్ కల్యాణ్ కు లేవని స్పష్టంగా తెలిసిపోయింది" అంటూ సజ్జల విమర్శనాస్త్రాలు సంధించారు.
ఎవరు ఎన్ని సీట్లలో, ఎక్కడ పోటీ చేసినా వైసీపీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని, వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.