GVL Narasimha Rao: ఏపీలో సీట్ల సర్దుబాటుపై అధిష్ఠానం నుంచి ఎలాంటి సూచనలు లేవు: బీజేపీ నేత జీవీఎల్
- ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు
- బీజేపీ కూడా తమతో కలుస్తుందని భావిస్తున్న రెండు పార్టీలు
- ఏపీలో ఎన్నికలకు ఎలా వెళ్లాలన్నది హైకమాండ్ చూసుకుంటుందన్న జీవీఎల్
ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉండగా, ఇవాళ రెండు పార్టీలు తమ తొలి జాబితాను ప్రకటించాయి. తమ కూటమితో బీజేపీ కూడా చేయి కలుపుతుందని టీడీపీ, జనసేన ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సీట్ల సర్దుబాటుపై బీజేపీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సూచనలు లేవని వెల్లడించారు.
ఇవాళ ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల బీజేపీ ఎన్నికల కమిటీలు హాజరయ్యాయి.
ఈ సమావేశం అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ... త్వరలో జరగనున్న ఎన్నికలకు సమాయత్తం అయ్యే దిశగా నేటి సమావేశం జరిగిందని తెలిపారు. ఏపీలో ఎన్నికల్లో ఎలా వెళ్లాలన్నదానిపై బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 27న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్రానికి వస్తున్నారని, ఒకే రోజున మూడు పార్లమెంటు క్లస్టర్ల సమావేశాల్లో పాల్గొంటారని వివరించారు.