Mangalagiri AIIMS: మంగళగిరిలో ఎయిమ్స్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఏక కాలంలో దేశంలోని 5 ఎయిమ్స్ లకు ప్రారంభోత్సవం
- గత ఆరేడు దశాబ్దాలతో పోల్చితే అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్న మోదీ
మంగళగిరిలో నిర్మించిన ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థను జాతికి అంకితం చేశారు.
మంగళగిరి ఎయిమ్స్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, భారతి ప్రవీణ్, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా పాల్గొన్నారు.
ఇవాళ దేశవ్యాప్తంగా 5 ఎయిమ్స్ ను ప్రధాని మోదీ ఏకకాలంలో ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్ తో పాటు రాజ్ కోట్ (గుజరాత్), భటిండా (పంజాబ్), రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), కల్యాణి (పశ్చిమ బెంగాల్) ఎయిమ్స్ లను కూడా మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్ల పాటు దేశంలో ఒకే ఒక ఎయిమ్స్ ఉండేదని, అది కూడా ఢిల్లీలో ఉండేదని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాలకు 7 ఎయిమ్స్ లకు ఆమోదం లభిస్తే, వాటిని కూడా పూర్తి చేయలేకపోయారని గత ప్రభుత్వాలపై మోదీ విమర్శలు చేశారు.
అయితే, ఇప్పుడు కేవలం 10 రోజుల్లోనే 7 కొత్త ఎయిమ్స్ ను ప్రారంభించడమో, లేదా శంకుస్థాపన చేయడమో జరిగిందని, దీన్నిబట్టి గత ఆరేడు దశాబ్దాలతో పోల్చితే ఇప్పుడు దేశాభివృద్ధి వేగం పుంజుకుందని వివరించారు.