Masala-Cancer Treatment: మసాలాలతో క్యాన్సర్ ఔషధాలు.. మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తల పరిశోధన
- క్యాన్సర్ చికిత్సకు మాసాలా ఆధారిత నానో ఔషధాలపై శాస్త్రవేత్తల పరిశోధనలు
- 2028 నుంచి ఇవి అందుబాటులోకి రావచ్చన్న పరిశోధకులు
- ఈ విధానంపై ఇప్పటికే తమకు పేటెంట్ దక్కిందని వెల్లడి
ఎన్నో ఔషధగుణాలున్న మసాలాలను క్యాన్సర్ చికిత్సలో వినియోగించే దిశగా ఐఐటీ మద్రాస్ పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిపై ఇప్పటికే తమకు పేటెంట్ దక్కిందని, 2028 నుంచి ఈ ఔషధాలు అందుబాటులోకి రావచ్చని వెల్లడించారు. భారతీయ మసాలాలతో తయారు చేసిన నానో ఔషధాలకు క్యాన్సర్‌ను అడ్డుకునే సామర్థ్యం ఉందని చెప్పారు. ఊపిరితిత్తులు, రొమ్ము, పేగు, గర్భాశయ ముఖద్వారం.. తదితర క్యాన్సర్లపై ఇవి ప్రభావం చూపిస్తాయని వెల్లడించారు. జంతువులపై ప్రయోగాలు విజయవంతం కావడంతో మానవుల్లో వీటి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు సన్నద్ధమవుతున్నట్టు చెప్పారు.
మసాలాల్లోని ఔషధ గుణాలున్న క్రియాశీల పదార్థాన్ని శరీరంలోని లక్షిత ప్రాంతానికి చేరవేసే అంశంలో కొన్ని పరిమితుల కారణంగా ఇవి ఔషధాలుగా అందుబాటులోకి రాలేదని ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు తెలిపారు. నానో ఎమల్షన్ వల్ల ఈ పరిమితిని అధిగమించొచ్చన్నారు. ఇందుకు ఎమల్షన్ స్థిరత్వం ఎంతో కీలకమని, దీన్ని తమ ల్యాబ్‌లో మెరుగుపరిచామని ఐఐటీ మద్రాస్ రసాయన ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఆర్. నాగరాజన్ తెలిపారు. నానో ఔషధాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.