Dharmana Prasada Rao: కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి దొబ్బేస్తామన్నాడు: ధర్మాన సంచలన వ్యాఖ్యలు

Dharmana Prasad sensational comments

  • ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అజమాయిషీ చేయాలనుకుంటున్నారని ధర్మాన ఆగ్రహం
  • ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని వ్యాఖ్య
  • శ్రీకాకుళంకు తాను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదన్న ధర్మాన

దశాబ్దాలుగా తాను ఎంతో ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళంను చూశానని... ఇప్పుడు శ్రీకాకుళం రౌడీల చేతిలోకి వెళ్తోందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి దొబ్బేస్తామని అన్నాడని... నువ్వు ఎవడివి? శ్రీకాకుళం నీ అబ్బసొత్తు కాదని తాను చెప్పానని తెలిపారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అజమాయిషీ చేయాలనుకుంటున్నారని... ఇలాంటి వాటిని ఇక్కడి నేతగా తాను అవమానంగా భావిస్తానని చెప్పారు. సుబ్బారెడ్డికి పైన ఒక లీడర్ ఉంటాడని, ఆ లీడర్ కు పైన మరొక లీడర్ ఉంటాడని తెలిపారు. శ్రీకాకుళంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నాయని... వాటిని కొట్టేసేందుకు రౌడీ మూకలు ఇక్కడకు వస్తున్నాయని ధర్మాన తెలిపారు. వారు ఏ పార్టీకి చెందిన వారైనా తాను అడ్డుకుంటానని చెప్పారు. ఇలాగే వదిలేస్తే ఈ ప్రాంతమంతా రౌడీలమయం అవుతుందని అన్నారు. ఇతర ప్రాంతాలు కూడా ఇలాగే పాడవుతున్నాయని చెప్పారు. పట్టణాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. 

ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని ధర్మాన అన్నారు. మరొకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదని చెప్పారు. ఎవరో ఆస్తిని అయాచితంగా కొట్టేయాలనుకోవడం నీచమని అన్నారు. ఇలాంటి పనులు ఎవరు చేయాలనుకున్నా చేయనివ్వకూడదని చెప్పారు. ఈ విధానాన్ని తాను పాటిస్తానని అన్నారు. 

శ్రీకాకుళంకు తాను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదని ధర్మాన చెప్పారు. జిల్లాలో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తానని... కానీ, శ్రీకాకుళంలో మాత్రం తాను తప్ప మరెవరూ గెలవలేరని అన్నారు. మీ అందరి అభిమానంతోనే ఇంతకాలం గెలిచానని... ఈసారి కూడా విజ్ఞతతో ఆలోచించాలని... తనను గెలిపించాలని కోరారు. గెలిస్తే మరింత శక్తిమంతంగా ఉంటానని.. ఓడిపోతే మీ స్నేహితుడిగా ఉంటానని చెప్పారు.

  • Loading...

More Telugu News