Husbands Being Beaten: భార్యల చేతుల్లో చావుదెబ్బలు తింటున్న భర్తలు తెలంగాణలోనే ఎక్కువట!
- వెల్లడించిన రీసెర్చ్ సంస్థ బయో సోషల్ స్టడీస్
- అధ్యయనాన్ని ప్రచురించిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్
- చావుదెబ్బలు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యులే ఎక్కువ
- భారత్‌లో పురుషులకు రక్షణ చట్టాలు లేకపోవడమే కారణమన్న అధ్యయనం
మీరు చదివింది నిజమే! భార్యల చేతుల్లో చావుదెబ్బలు తింటున్న భర్తల సంఖ్య తెలంగాణలోనే ఎక్కువట. బయో సోషల్ స్టడీస్‌లో అనే రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. తన్నులు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యుల సంఖ్యే ఎక్కువట. దేశంలో భర్తలపై జరుగుతున్న గృహహింసపై ఈ సంస్థ చేసిన అధ్యయనాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది.
గత 15 ఏళ్లలో భర్తలపై దాడులు ఐదింతలు పెరిగినట్టు అధ్యయనం పేర్కొంది. ప్రతి 1000 మంది మహిళల్లో 36 మంది భర్తలపై చేయిచేసుకుంటున్నారట. 2006లో మాత్రం ఈ సంఖ్య ఏడు మాత్రమే కావడం గమనార్హం. మనదేశంలో మహిళలకు మాత్రమే రక్షణ చట్టాలు ఉండడం కూడా పురుషులపై గృహహింస పెరగడానికి ఒక కారణమని అధ్యయనం పేర్కొంది. మద్యానికి బానిసైన భార్యలను వేధించడమే భర్తలపై దాడులకు ప్రధాన కారణమని అధ్యయనం వివరించింది.