addanki dayakar: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సరైన వ్యక్తి... నా భవిష్యత్తు ఆయన చేతిలోనే...: అద్దంకి దయాకర్

Addanki Dayakar hopes on revanth reddy and congress

  • తనకు మంచి అవకాశం వస్తుందేమోనన్న దయాకర్ 
  • లీడర్ లేని పార్టీగా బీఆర్ఎస్ తయారయిందని ఎద్దేవా
  • కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని నిలదీత
  • ఇండియా కూటమి విచ్ఛిన్నానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణ

తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సరైన వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్‍‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం లీడర్ లేని పార్టీగా బీఆర్ఎస్ తయారైందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డిని... బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించారని ఆరోపించారు. బిజీగా ఉన్నానని చెబితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం కేసు నుంచి మినహాయింపు ఇచ్చినట్లుగా... హేమంత్ సోరెన్, సోనియాగాంధీ వంటి మిగతా నాయకులకు ఎందుకు ఇవ్వరు? అని నిలదీశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిని కాపాడింది బీజేపీయే అని విమర్శించారు. తాము మాత్రం అవినీతిపరులను ఎవరినీ వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం అనుమతులు ఇచ్చిన వారిని కూడా వదలమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేసింది ఏమీ లేదని... కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారన్నారు. బీజేపీకి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు.

రేవంత్ రెడ్డి చేతిలో భవిష్యత్తు...

తన భవిష్యత్తు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధిష్ఠానం చేతిలో ఉన్నాయని అద్దంకి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ తనను ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటుందేమో... తనకు మంచి అవకాశం వస్తుందేమో అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు

ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని అద్దంకి దయాకర్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ముద్దుబిడ్డ మాజీ సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, ఇండియా కూటమికి మద్దతిచ్చే పార్టీల నేతలే లక్ష్యంగా కేంద్రం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సోరెన్, ఎన్సీపీ, విపక్ష నేతలే టార్గెట్‌గా బీజేపీ దాడులు చేస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీగా ముందుకు సాగాయని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో మొట్టమొదట వేటు వేయాల్సింది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పైన అని... ఆయనను కాపాడింది ఎవరు? అని ప్రశ్నించారు. తమతో పొత్తు కారణంగా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

  • Loading...

More Telugu News