Chandrababu: జగన్ ఆడే నాటకాల ముందు సురభి నాటకాలు కూడా దిగదుడుపే: చంద్రబాబు
- శ్రీకాకుళంలో రా కదలిరా సభ
- హాజరైన చంద్రబాబు
- జగన్ తన నాటకాలతో పేదలను మోసం చేస్తున్నాడని ఆగ్రహం
- ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశామని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ తన నాటకాలతో పేదలను మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్ నాటకాల ముందు సురభి నాటకాలు కూడా పనిచేయవని వ్యంగ్యం ప్రదర్శించారు.
పేదల రక్తం తాగేవాడు పేదల ప్రతినిధి అవుతాడా? రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నాడు... ఊరికో ప్యాలెస్ ఉన్న వ్యక్తి తాను పేదవాడ్నని చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు విమర్శించారు.
జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలను పేదరికంలోకి నెట్టేశారని, వైసీపీ నేతలు మాత్రం ధనవంతులయ్యారని అన్నారు. ఒక చేత్తో రూ.10 ఇచ్చి, మరో చేత్తో రూ.100 దోచుకునే దోపిడీ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు.
1 కోటి 30 లక్షల మంది నుంచి నాకు సమాధానం వచ్చింది
నేనేమీ అల్లాటప్పాగా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక చేయలేదు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలకు ఫోన్ కాల్స్ చేశాను. ఏం తమ్ముళ్లూ... నా నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయా, లేదా? 1.30 కోట్ల మంది నుంచి నా నుంచి ఫోన్ కాల్స్ కు సమాధానం వచ్చింది. వారందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్న మీదటే ఏ నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టాలన్నది నిర్ణయించాం. తమకు ఏ అభ్యర్థి కావాలో ప్రజలే నిర్ణయించుకున్నారు.
కొత్త విధానాలు అమలు చేయడంలో నేనెప్పుడూ ముందుంటాను. అమెరికాలో ఓ విధానం ఉంది. ఎన్నికల కంటే ముందు ఆయా పార్టీల్లోనే అంతర్గత ఎన్నికలు జరుగుతాయి. అందులో గెలిచిన అభ్యర్థులే ప్రజా ఎన్నికల్లో పాల్గొంటారు. అయితే మనం ఇక్కడ ముందు ప్రజల్లోకి వెళ్లి వాళ్ల అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశాం. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ-జనసేన కూటమికే ఓటేయాలి.
ఇవాళ ఒక స్టేట్ మెంట్ చూశాను
ఈసారి ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించాలి. రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్. ఇలాంటి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించాలి. ఇవాళే ఒక స్టేట్ మెంట్ చూశాను. అధర్మాన... రెవెన్యూ మంత్రి అంట. ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాడు.
ఎవడో సుబ్బారెడ్డి అంట... కడప నుంచి వచ్చాడంట... వాడొచ్చి ఇక్కడ భూములు కొట్టేస్తే నేను చూస్తూ ఉండాలా? అని ఈ మంత్రి బాధపడుతున్నాడు. ఆ భూములు తాను కొట్టేయలేకపోతున్నానే అని ఈయన బాధ.
నువ్వొక రెవెన్యూ మంత్రివి... ఎక్కడో కడప నుంచి వచ్చిన సుబ్బారెడ్డి భూములు కొట్టేస్తున్నాడని నువ్వు నిస్సహాయంగా మాట్లాడావంటే ఏమనాలి? నీకు చేతనైతే ఆ సుబ్బారెడ్డిని పట్టి పోలీసులకు అప్పజెప్పి శ్రీకాకుళం జైల్లో పెట్టించి ఉంటే శభాష్ అని అభినందించేవాడ్ని.
జగన్ గ్యాంగ్ ను చూస్తే వీళ్లకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి!
జగన్ మోహన్ రెడ్డి గ్యాంగ్ బందిపోటు దొంగలు. ఎక్కడ భూమి దొరికితే అక్కడ వాళ్లు వాలిపోతారు, ఎక్కడ గనులు ఉంటే అక్కడ వాలిపోతారు. వాళ్లను చూస్తే ఇక్కడ ఉండే మంత్రులకు, స్పీకర్ కు ప్యాంట్లు తడిచిపోతాయి! భయపడిపోతున్నారు వీళ్లు... వణికిపోతున్నారు... వీళ్లు నాయకులా? అందుకే టీడీపీ-జనసేన కూటమికి ఓటేయాలి. రెండు పార్టీల కార్యకర్తలకు చెబుతున్నా... ఈ 40 రోజులుగా గట్టిగా కృషి చేయండి. సముచితంగా ఎక్కడెక్కడ ఎవరెవరికి గౌరవం ఇవ్వాలో ఆ బాధ్యత మేం తీసుకుంటాం.