paidi rakesh reddy: దేశద్రోహులకు, దేశభక్తులకు మధ్య జరిగే పోరాటం లోక్ సభ ఎన్నికలు: బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
- నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని, తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
- 500 ఏళ్లుగా అయోధ్యలో రాముడికి ఎవరూ గుడి కట్టలేదని ఆవేదన
- ఆడబిడ్డలను, హిందూ దేవతలను అవమానించిన మజ్లిస్ పార్టీకి ఓటేయొద్దని విజ్ఞప్తి
రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశద్రోహులకు, దేశభక్తులకు మధ్య జరిగే పోరాటమని బీజేపీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలిసి నడుద్దాం... నరేంద్ర మోదీని మరోసారి గెలిపిద్దాం అనే నినాదంతో తెలంగాణ బీజేపీ ఆయా జిల్లాల్లో విజయ సంకల్ప యాత్రలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కొమురం బీమ్ క్లస్టర్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద సోమవారం నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని, తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
500 ఏళ్లుగా అయోధ్యలో రాముడికి గుడిలేదని.. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మాత్రమే రాముడికి గుడి కట్టించారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలను, హిందూ దేవతలను అవమానించిన మజ్లిస్ పార్టీకి ఓటేయొద్దని విజ్ఞప్తి చేశారు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.