Revanth Reddy: కేసీఆర్ చేసిన అప్పులతో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది: రేవంత్ రెడ్డి
- ఆరు గ్యారెంటీలపై ఎలాంటి అపోహలు వద్దన్న రేవంత్ రెడ్డి
- మార్చి 31వ తేదీ లోగా రైతు బంధు ఇస్తామని ఇప్పటికే చెప్పామన్న సీఎం
- రేపు మరో రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ చేసిన అప్పులతో తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. మార్చి 31వ తేదీ లోగా రైతు బంధు ఇస్తామని ఇప్పటికే చెప్పామని, కానీ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. రేపు మరో రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలో ముంచేశారని ఆరోపించారు. తాము క్రమంగా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని తెలిపారు. ఇంతటి ఆర్థిక సంక్షోభంలోనూ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్యారెంటీల అమలు నిరంతర ప్రక్రియ అని తేల్చి చెప్పారు. ఆరు గ్యారంటీలను ఒక్కటొక్కటి అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజలకు వివరిస్తామన్నారు.