Indian Consumer Spending: దశాబ్దకాలంలో భారత్‌లో ఎన్నో మార్పులు.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు
- భారతీయుల ఖర్చులపై 2022-23 మధ్య కాలంలో సర్వే
- నగరవాసుల కంటే గ్రామీణులే ఆహారంపై అధికంగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడి
- పప్పులు తృణ ధాన్యాలకంటే పాలు, మాంసాహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్‌పైనే అధికంగా ఖర్చు
- ఖర్చుల్లో ఆహారం వాటా తగ్గుతున్న వైనం, ఆదాయాల్లో పెరిగిన అంతరం
భారత్ ఆర్థికంగా ముందడుగు వేస్తోందా? భారతీయుల ఆదాయాలు పెరుగుతున్నాయా? ఆర్థిక అంతరాలూ పెరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ గణాంకాలు. భారత గ్రామీణులు, నగరవాసుల ఖర్చులపై సర్వే మంత్రిత్వ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. 2022-23 మధ్య కాలంలో నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
తాజాగా సర్వే ప్రకారం గ్రామీణులు నగరవాసుల కంటే సగటున అధికంగా ఆహారంపై ఖర్చు చేస్తున్నారు. గ్రామీణులు 2011-12లో సగటున నెలకు ఆహారంపై రూ. 1,430 ఖర్చు చేయగా 2022-23 ఇది రూ 3,773కి పెరిగింది. గ్రామీణ భారత ఆహారఖర్చుల్లో 164 శాతం వృద్ధి నమోదు కాగా నగరవాసుల ఆహార ఖర్చులు కేవలం 146 శాతం మాత్రమే పెరిగాయి.
భారతీయుల మొత్తం ఖర్చుల్లో ఆహారం వాటా కూడా తగ్గింది. 2011-2012లో ఆహారంపై గ్రామీణులు తమ ఆదాయంలో 52.9 శాతం ఖర్చు చేయగా ప్రస్తుతం ఇది 46.4 శాతానికి పడిపోయింది. నగరవాసుల్లో కూడా ఇదే ధోరణి కనిపించింది. ఒకప్పుడు 48.1 శాతం ఉన్న ఆహార ఖర్చులు ప్రస్తుతం 39.2 శాతానికి పడిపోయాయి.
భారతీయుల ఆదాయాల పెరుగుదలే ఈ ధోరణికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆదాయం పెరిగే కొద్దీ ఇతర ఖర్చులు పెరుగుతాయని ఫలితంగా ఆహారంపై చేసే ఖర్చుల నిష్ఫత్తి తగ్గుతుందని చెబుతున్నారు. లగ్జరీ వస్తువులు, పర్యటనలు, ఇతర అవసరాలపై దృష్టి మళ్లుతుందని అంటున్నారు.
ఆదాయాలు పెరిగే కొద్దీ భారతీయుల ఆహారపు అలవాట్లలో కూడా మార్పు వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు భారతీయుల ఆహారంలో పప్పులు, తృణధాన్యాలు అధికంగా ఉండేవి. 2011-12లో గ్రామీణ భారతీయుల ఆహారంలో పప్పులు, తృణధాన్యాల వాటా 25.8 శాతం కాగా ప్రస్తుతం ఇది 14.92 శాతానికి తగ్గగా పాల ఉత్పత్తులు, మాంసాహారం, పండ్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం పెరిగింది. నగరవాసుల్లోనూ ఈ మార్పు కనిపిస్తోంది. భారతీయులు మరింత బలవర్థకమైన ఆహారంవైపు మళ్లుతున్నారని, ఆదాయాలు పెరుగుతున్నాయని చెప్పేందుకు ఈ మార్పులు మంచి ఉదాహరణ అని పరిశీలకులు అంటున్నారు. అయితే, కూల్‌డ్రింక్స్, ఫాస్ట్‌ఫుడ్ వినియోగం పెరగడం ఆందోళనకరమని అంటున్నారు.
అదాయాలు పెరిగినంత మాత్రాన ప్రజలు వృథా ఖర్చులు చేయట్లేదని కూడా సర్వేలో తేలింది. టీవీలు, వాషింగ్ మెషీన్లు వంటి డ్యూరబుల్ గూడ్స్‌పై అధికంగా ఖర్చు చేస్తున్నట్టు తెలింది. వీటి వినియోగంతో జీవితం సౌకర్యవంతం అవడంతో పాటూ సగటు ఉత్పాదకత మెరుగవుతుంది. గ్రామీణులు, నగరవాసుల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని సర్వే తేల్చింది.
అయితే, ఆదాయాలు వృద్ధి చెందుతున్నప్పటికీ భారతీయుల్లో ఆర్థిక అంతరాలు కూడా పెరగడం ఆందోళన కలిగించే అంశమని సర్వే తేల్చింది. గ్రామీణుల్లో ఆదాయ పరంగా అట్టడుగున ఉన్న 5 శాతం మంది రోజుకు సగటున 46 రూపాయలు ఖర్చు చేస్తే శిఖరాగ్రాన ఉన్న 5 శాతం మంది మాత్రం రూ.250 ఖర్చు చేస్తున్నారు. నగరవాసుల్లో ఈ గణాంకాలు రూ.67, రూ.700గా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడం ప్రభుత్వానికి ఓ సవాలుగా మారనుందన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. స్థూలంగా చూస్తే ఈ పదేళ్లల్లో భారత్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని ఈ సర్వే తేల్చింది.