S Somanath: ‘గగన్‌యాన్' వ్యోమగాముల పేర్లను నేడు ప్రకటించనున్న ప్రధాని
- పేర్లు ప్రకటించడానికి ముందు వ్యోమగాములతో ప్రధాని మోదీ మాట్లాడతారని చెప్పిన ఇస్రో చైర్మన్ సోమనాథ్
- నేడు విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్న మోదీ
- 2025లో గగన్‌యాన్ ప్రాజెక్ట్ ప్రయోగం
ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. భారత్ మొట్టమొదటిసారి చేపడుతున్న మానవ-సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్ మిషన్’లో భాగంగా అంతరిక్షానికి పంపించనున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (నేడు) ప్రకటిస్తారని తెలిపారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వీఎస్‌ఎస్‌సీ) సందర్శనలో భాగంగా వారి పేర్లను వెల్లడించనున్నారని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సోమనాథ్ ఒక వీడియో విడుదల చేశారు. వ్యోమగాముల పేర్లు ప్రకటించడానికి ముందు ప్రధాని మోదీ వారిని కలవనున్నారని పేర్కొన్నారు.
వీఎస్‌ఎస్‌సీలో ప్రధాని పర్యటించనుండడం చాలా సంతోషంగా ఉందని సోమనాథ్ అన్నారు. కాగా గగన్‌యాన్ ప్రాజెక్ట్ ప్రయోగం 2025లో జరగనుంది. మానవులను అంతరిక్షంలోకి పంపించి, తిరిగి తీసుకురాగల సత్తా ఇస్రోకు ఉందని చాటి చెప్పడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ఉంది. భారత ప్రాదేశిక జలాల్లో వ్యోమగాములను సురక్షితంగా ల్యాండింగ్ చేయనున్నారు. వీఎస్‌ఎస్‌సీలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ప్రపంచ స్థాయి సాంకేతిక సౌకర్యాలకు ఉద్దేశించిన మూడు అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటి విలువ దాదాపు రూ.1800 కోట్లుగా ఉంది.