Odysseus: అమెరికా తొలి ప్రైవేటు స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయింది ఇక్కడే.. ఫొటోలు విడుదల చేసిన నాసా
- గతవారం చంద్రుడిపై ల్యాండ్ అయిన ఒడిస్సియస్
- 1972 తర్వాత తొలిసారి చంద్రుడిపై దిగిన అమెరికా వ్యోమనౌక
- 90 కిలోమీటర్ల పైనుంచి ఫొటోలు తీసి పంపిన అమెరికా రికానైసెన్స్ అర్బిటర్
అమెరికాకు చెందిన ఇన్‌ట్యూటివ్ మెషీన్స్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన తొలి లూనార్ ల్యాండర్ ‘ఒడిస్సియస్’ను చంద్రుడి ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి గత వారం జరిగిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఓ ప్రైవేటు కంపెనీ చంద్రుడిపైకి రోబోను పంపడం ఇదే తొలిసారి.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ఒడిస్సియస్ ల్యాండ్ అయిన ప్రదేశం ఫొటోలను షేర్ చేసింది. తమ లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్ ఈ ఫొటోలు తీసిందని పేర్కొంది. ఈ నెల 24న 90 కిలోమీటర్ల పైనుంచి తమ నిఘా ఉపగ్రహం ఈ ఫొటోలు తీసిందని తెలిపింది. కాగా, 1972లో అపోలో 17 తర్వాత అమెరికాకు చెందిన మరో స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై ల్యాండ్ కావడం ఇదే తొలిసారి.