Body building: బాడీ బిల్డింగ్ కు జింక్ కావాలని నాణాలు మింగాడట.. ఢిల్లీ యువకుడి వింత చేష్ట
- వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వైనం
- ఆపరేషన్ చేసి 39 నాణాలు, 37 మాగ్నెట్స్ బయటకు తీసిన వైద్యులు
- యువకుడి మానసిక ఆరోగ్యంపై అనుమానంతో సైకియాట్రిస్ట్ కు రిఫర్ చేసిన డాక్టర్
కండలు తిరిగిన బాడీ కోసం జిమ్ లో కసరత్తులు చేయడం చూస్తుంటాం.. ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడమూ తెలుసు. కానీ ఢిల్లీకి చెందిన ఓ యువకుడు మాత్రం నాణాలు, అయస్కాంతాలు మింగాడట. బాడీ బిల్డింగ్ కు జింక్ అవసరమని భావించి, కనిపించిన చిల్లర నాణాలను గుటుక్కుమనిపించాడట. చివరకు వాంతులు, పొత్తి కడుపులో నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. స్కానింగ్ లో యువకుడి పొట్టలో నాణాలు చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆపరేషన్ చేసి 39 నాణాలతో పాటు 37 అయస్కాంతాలను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..
పొత్తి కడుపులో నొప్పి, వాంతులతో 26 ఏళ్ల ఓ యువకుడు ఎమర్జెన్సీ వార్డులో చేరాడు. గడిచిన 20 రోజులుగా వాంతులతో ఏమీ తినలేకపోతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారని ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ మిట్టల్ పేర్కొన్నారు. దీంతో స్కానింగ్ చేసి చూడగా యువకుడి పొట్టలో నాణాలు కనిపించాయని చెప్పారు. పేగుల్లోకి చేరిన నాణాలు ఆహారం లోపలికి చేరకుండా అడ్డుకుంటున్నాయని గుర్తించామన్నారు. దీంతో ఆపరేషన్ చేసి రూ.1, 2, 5 విలువైన మొత్తం 39 నాణాలు బయటకు తీశామని డాక్టర్ వివరించారు. ఆపరేషన్ తర్వాత కాస్త కోలుకున్న యువకుడిని ప్రశ్నించగా.. ఆహారంలోని జింక్ ను శరీరం గ్రహించేందుకు తోడ్పడతాయనే ఉద్దేశంతోనే నాణాలను మింగినట్లు చెప్పాడట. వారం రోజుల తర్వాత పూర్తిగా కోలుకోవడంతో యువకుడిని డిశ్చార్జి చేశామని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడనే అనుమానంతో సైకియాట్రిస్ట్ కు రిఫర్ చేశామని డాక్టర్ తరుణ్ మిట్టల్ చెప్పారు.