Hariramajogaiah: పవన్ పాత్ర ఏమిటో రేపు 'జెండా' సభలో చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే: హరిరామజోగయ్య డిమాండ్
- తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28న జెండా సభ
- హాజరవుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
- రాజ్యాధికారం వస్తే ఎవరి పాత్ర ఏమిటో ఇప్పుడే తేలాలన్న హరిరామజోగయ్య
తాడేపల్లిగూడెంలో రేపు (ఫిబ్రవరి 28) టీడీపీ, జనసేన పార్టీల జెండా సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరవుతుండడంతో ఇరు పార్టీల శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో, సీనియర్ రాజకీయవేత్త హరిరామజోగయ్య కొన్ని ప్రశ్నలు సంధించారు. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం పట్ల అసంతృప్తితో ఉన్న ఆయన కొన్ని అంశాల్లో తనకు స్పష్టత కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు కాపు సామాజిక వర్గానికి బహిరంగ లేఖ రాశారు.
హరిరామజోగయ్య సంధించిన ప్రశ్నలు...
- సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం సాగిస్తోన్న అరాచక పాలనను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడినప్పటికీ అందులో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ పాత్ర ఏమిటి?
- ఇటీవల రాజకీయ పరిణామాలను చూస్తే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారిపట్టినట్టు కనిపిస్తోంది... మరి రాజ్యాధికారం లభిస్తే అందులో పవన్ కల్యాణ్ పాత్ర ఏమిటి?
- బడుగు బలహీన వర్గాలు కోరుకున్న మేరకు ప్రభుత్వం ఏర్పడితే అందులో పవన్ కల్యాణ్ అధికారం ఎంత? చంద్రబాబు అధికారం ఎంత?
ఈ ప్రశ్నలకు టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి తాడేపల్లిగూడెం సభ ద్వారా సమాధానాలు చెప్పాలని హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. రాజ్యాధికారం వస్తే అందులో పవన్ పాత్ర ఏమిటో, చంద్రబాబు పాత్ర ఏమిటో చెప్పకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే... అందులో గౌరవమైన హోదాను పవన్ కల్యాణ్ పొందాలని, బడుగు బలహీన వర్గాల వారి కోసం తగిన నిర్ణయాలు తీసుకోగలిగిన సర్వాధికారాలతో ఆ హోదా ఉండాలని హరిరామజోగయ్య ఉద్ఘాటించారు.