Bandi Sanjay: బండి సంజయ్‌కి ఎంపీ పదవి పునరావాస కేంద్రమా?: వినోద్ కుమార్

Vinod Kumar targets Bandi Sanjay

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి మళ్లీ ఎంపీ ఎన్నికల కోసం వస్తున్నాడన్న వినోద్ కుమార్
  • బండి సంజయ్ పార్టీ కోసం పని చేశాడు తప్ప ప్రజల కోసం పని చేయలేదని విమర్శ
  • రాజకీయాల్లో గెలుపోటములు సహజం... ఎట్టి పరిస్థితుల్లో తలవంచేది లేదని వ్యాఖ్య

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి మళ్లీ ఎంపీ ఎన్నికల కోసమని ముందుకు వస్తున్నాడని... బండి సంజయ్‌కి ఎంపీ పదవి ఏమన్నా పునరావాస కేంద్రమా? అని బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వేములవాడ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి అయిదేళ్లు అవుతోందని... ఇప్పటివరకు ఆయన తన పార్టీ బీజేపీ కోసం మాత్రమే పని చేశాడు తప్ప ఏ రోజూ ప్రజల కోసం పని చేయలేదని ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. అయిదేళ్ల పదవీ కాలంలో సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఐదు రూపాయల నిధులు కూడా తీసుకురాలేదన్నారు.

2004లో అయిదుగురు ఎంపీలు గెలిచి ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్‌లో కేసీఆర్‌తో కలిసి గళమెత్తి తెలంగాణను సాధించామని వినోద్ అన్నారు. 2006లో తెలంగాణ ఇస్తామని నాటి యూపీఏ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 2009లో మళ్లీ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లు చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రోజుకు 18 గంటలు పని చేశారని, కేవలం మూడున్నరేళ్ల కాలంలోనే కృష్ణ, గోదావరి నదులపై పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టామన్నారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని... కానీ, ఎట్టి పరిస్థితుల్లో తలవంచేది లేదన్నారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా నిలబడి అధికార పక్షంపై పోరాటం చేస్తామన్నారు. కేంద్రంలో ఈ పదేళ్ల కాలంలో ప్రధానిగా మోదీ ఉన్నారని.. 2014 నుంచి 2019 వరకు తాను కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం రూ.1000 కోట్లు తీసుకువచ్చి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. మానేరు రివర్ ప్రంట్‌తో పాటు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేశామన్నారు. జాతీయ రహాదారుల కోసం పార్లమెంట్‌లో కొట్లాడి కరీంనగర్ చుట్టుపక్కల నాలుగు జాతీయ రహదారులను నిర్మించామన్నారు.

  • Loading...

More Telugu News