Macherla: మాచర్ల రాజకీయ పరిస్థితులపై ఎస్ఈసీకి లేఖ రాసిన అచ్చెన్నాయుడు
- మాచర్లలో తీవ్రస్థాయిలో రాజకీయ స్పర్ధలు
- గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు
- వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్ఈసీని కోరిన అచ్చెన్న
ఏపీలో రాజకీయంగా సమస్యాత్మక ప్రాంతాల్లో మాచర్ల ఒకటి. ఇక్కడ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య స్పర్ధలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. పలు సందర్భాల్లో మాచర్లలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇప్పుడు ఎన్నికల ముందు మాచర్ల ప్రాంతం నివురుగప్పిన నిప్పులా ఉండగా, ఎన్నికల సమయంలో ఇక్కడ పరిస్థితులు ఎలా మారతాయోనని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో, మాచర్లలో వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఆక్రమణలకు గురయ్యే పోలింగ్ కేంద్రాల వివరాలను లేఖలో పొందుపరిచారు. 2009, 2014, 2019లో ఇక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ ను విశ్లేషించాలని కోరారు.
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనివ్వలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆ మేరకు మాచర్ల, కారంపూడి, దుర్గి, రెంటచింతల, వెల్దుర్తిలో నామినేషన్ల వివరాలను ఎస్ఈసీకి పంపించారు.
మాచర్లలో వైసీపీ గూండాలు దౌర్జన్యాలకు దిగారని వెల్లడించారు. మాచర్లలోని సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు డబ్బులు పంచారు: ఎస్ఈసీకి టీడీపీ నేత షరీఫ్ లేఖ
టీడీపీ నేత షరీఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు నేడు లేఖ రాశారు. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వాలంటీర్లకు డబ్బు పంచారని షరీఫ్ తన లేఖలో ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి అన్నా రాంబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీ సమావేశానికి హాజరైన వాలంటీర్లపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.