Chicken prices: ఏపీలో భారీగా పెరిగిన చికెన్ ధరలు
- పలు చోట్ల కేజీ రూ.300 పలుకుతున్న చికెన్
- కోళ్ల ఉత్పత్తి తగ్గడమే ప్రధాన కారణం
- మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు
ఏపీలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉన్న కారణంగా పలు చోట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని చోట్ల కేజీ చికెన్ ఏకంగా రూ.300లకు చేరింది. కార్తీక మాసం సమయంలో కేజీ చికెన్ రూ.130 నుంచి రూ.140 మధ్య పలికాయి. దీంతో నష్టాల భయంతో కోళ్ల ఫారాల యజమానులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. దీంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కొరత కారణంగా ధరలు భారీగా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో మార్చి వరకు చికెన్ ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా కోళ్ల ఉత్పత్తి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కోడి గుడ్ల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మార్కెట్‌లో ఒక్కో గుడ్డు రూ.5 పైనే పలుకుతోంది.
తెలంగాణలోనూ ఇదే పరిస్థితి..
తెలంగాణలో కూడా చికెన్ ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 280 నుంచి 300 వరకు ఉంది. పెరుగుతున్న ఎండలతో పాటు ఇటీవల జరిగిన మేడారం జాతర నేపథ్యంలో కోళ్ల సరఫరా తగ్గిపోయింది. డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. కిలో లైవ్ కోడి ధర కూడా రూ. 180 వరకు చేరుకుంది. గత నాలుగు రోజులుగా సాధారణ అమ్మకాలతో పోలిస్తే చికెన్ అమ్మకాలు 40 శాతం పడిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో సగటున ప్రతి రోజు 12 వేల టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. గత ఆదివారం హోల్ సేల్, రిటైల్ కలిపి కేవలం 6 వేల టన్నుల విక్రయాలు మాత్రమే జరిగాయి. ఎండాకాలం ముగిసిన తర్వాతే చికెన్ ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు చెపుతున్నారు.