Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో అనూహ్య రాజకీయ సంక్షోభం!.. సిమ్లా నుంచి హర్యానా వెళ్లిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Unpredictable political crisis in Himachal Pradesh as BJP leaders met the state governor

  • కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదింపజేసుకునే బలాన్ని కోల్పోయిందన్న బీజేపీ
  • అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్‌కు వినతి
  • రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు

రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసిన కొన్ని గంటల అనంతరం అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నాయి. జైరాం ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ఉదయం కలిశారు. బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్‌ను కోరారు. బడ్జెట్ సమావేశాల ఆరంభానికి ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. బడ్జెట్‌ను ఆమోదింపజేసుకునే బలాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని జైరాం ఠాకూర్ అన్నారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేస్తారేమోనని అనుమానంగా ఉందని జైరాం ఠాకూర్ పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని, రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చెల్లుబాటు అవుతుందని అన్నారు.


సిమ్లా నుంచి హర్యానా వెళ్లిన కాంగ్రెస్
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం సిమ్లా నుంచి హర్యానాకు వెళ్లారు. ఈ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్టుగా రిపోర్టులు వెలువడుతున్నాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడినట్టుగా కనిపిస్తోంది. కాగా కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. అసంతృప్త ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూపిందర్ సింగ్ హూడా, డీకే శివకుమార్‌లను రంగంలోకి దించింది. సీఎం సుఖ్విందర్ సింగ్ పట్ల అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో వీరిద్దరు చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. దీంతో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేడు హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News