TDP Janasena Sabha: టీడీపీ-జనసేన సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వని అధికారులు
- బస్సులు కావాలంటూ టీడీపీ జనసేన నేతల విజ్ఞప్తి
- 100 బస్సులు కావాలని కోరినా ఒక్కటి కూడా కేటాయించని అధికారులు
- సభకు తగిన బందోబస్తు కూడా కల్పించలేదని ఆరోపణలు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం (ఈరోజు) మధ్యాహ్నం నిర్వహించబోయే టీడీపీ - జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ఏపీఎస్ ఆర్టీసీ ఒక్క బస్సు కూడా కేటాయించలేదు. ‘జెండా’ పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభకు జనాలను తీసుకెళ్లేందుకు 100 బస్సులు కావాలంటూ ఇరుపార్టీల నాయకులు ఆర్టీసీకి విజ్ఞప్తి చేశారు. సభ కోసం 100 బస్సులు కావాలంటూ పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, 50 బస్సులు కావాలంటూ ఉండి ఎమ్మెల్యే రామరాజు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ దరఖాస్తులను ఆర్టీసీ అధికారులు తోసిపుచ్చినట్టు తెలుస్తోంది.
కనీసం ఒక్క బస్సు కూడా ఇవ్వలేదని టీడీపీ జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు సొంత వాహనాల్లోనే సభకు బయలుదేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయనున్న టీడీపీ, జనసేన పార్టీలు.. తొలిసారిగా ఎన్నికల ప్రచార సభను ఉమ్మడిగా నిర్వహించున్నాయి. ఈ ‘జెండా’ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాల్గొంటారు. అయితే, సభకు సెక్యూరిటీ కూడా తగినంత కల్పించలేదని ఇరు పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.