Siddaramaiah: విధానసౌధలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు... స్పందించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Action will be taken if BJP allegations proven true says Siddaramaiah

  • విధానసౌధలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వ్యక్తి
  • నినాదాలు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్న సిద్ధరామయ్య
  • పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన వారిని విడిచి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టీకరణ

కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఫలితాలు వెలువడిన తర్వాత కొంతమంది పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. పాకిస్థాన్‌కు అనుకూల నినాదాలు చేసినట్లు తేలితే అలాంటి వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కేవలం బీజేపీ మాత్రమే ఈ ఆరోపణలు చేయడం లేదు... మీడియా కూడా ఈ విషయాన్ని చెబుతోందన్నారు. వాయిస్ రిపోర్టును ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించామని, దేశ వ్యతిరేక నినాదాలు చేయడం నిజమని తేలితే ఆ వ్యక్తిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన వారిని విడిచి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

అసలేం జరిగింది?

రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నాసిర్ హుస్సేన్ గెలుపొందారు. ఆయన విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించగానే విధానసౌధలో నాసిర్ వెనుక ఉన్న వ్యక్తి ఒకరు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. దీంతో బీజేపీ, మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నాసిర్ హుస్సేన్ స్పందిస్తూ... అలా నినాదాలు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు. శత్రుదేశానికి అనుకూలంగా నినాదాలు చేయడాన్ని తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. దర్యాఫ్తు చేసి అలా నినాదాలు చేసిన వ్యక్తిని గుర్తించాలని డిమాండ్ చేశారు. కాగా 'పాకిస్థాన్ జిందాబాద్' ఎక్స్ వేదికపై ట్రెండింగ్‌లో నిలిచింది.

  • Loading...

More Telugu News