Pawan Kalyan: మీరేంటి నాకు సలహాలు, సూచనలు ఇచ్చేది... జగన్ ఎలాంటి వాడో మీకు తెలుసా?: పవన్
- తాడేపల్లిగూడెం సభలో పవన్ వీరావేశం
- తాను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తనకు తెలుసన్న పవన్
- ఐదుగురు రెడ్ల కోసం ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడెం జనసేన-టీడీపీ జెండా సభలో తీవ్ర భావోద్వేగాలతో ప్రసంగించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవకపోతే, నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ నిలబడరు అనే మాటను తాను నమ్ముతానని అన్నారు. తాను పొత్తు పెట్టుకున్నది అందుకేనని వెల్లడించారు. తాను 2019లోనే ప్రజలకు చెప్పానని, జగన్ కు ఓటేయొద్దని చెప్పినా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో సహకారం ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, అందుకే సహకారం అందించడానికి మనల్ని తగ్గించుకుని మరీ ప్రజలను గెలిపించడానికి ముందుకొచ్చానని వివరించారు. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నానని, పొత్తులు కూడా అందుకే పెట్టుకున్నానని తెలిపారు.
నేను యుద్ధం చేస్తున్నది మామూలు వ్యక్తితో కాదు!
సీట్ల పంపకంపై నాకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు... మీకేం తెలుసు ఈ జగన్ ఎలాంటివాడో! సొంత బాబాయ్ ని చంపాడు... సొంత చెల్లెలిని గోడకేసి కొట్టాడు. నేను ఎవడితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. నాకు సలహాలు, సూచనలు ఇవ్వాలని చూడొద్దు. సొంతబాబాయ్ ని చంపి గుండెపోటు అన్నా, వేల కోట్లు దోచినా, దళిత డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినా ఎవరూ ప్రశ్నించరు. ఏ తప్పు చేయని నన్ను ప్రశ్నిస్తారేంటి?
ఐదుగురు రెడ్ల కోసం ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు
రాష్ట్రంలో ఐదుగురు రెడ్ల కోసం ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో ఏ మూలకు వెళ్లినా ఈ ఐదుగురు రెడ్లు ప్రజలకు ఏం కావాలో నిర్ణయిస్తారు. ప్రజలకు ఏం కావాలో నిర్ణయించడానికి మీరెవరు? మాట్లాడితే నేను ఒక్కడినే అని జగన్ అంటున్నాడు. నువ్వు నిజంగా ఒక్కడివా? ఒక్కడివే ప్రజలను ఇబ్బంది పెడుతున్నావా? ఈయన యువ ముఖ్యమంత్రి అంట. యువతను బొంద పెట్టడానికి తప్ప ఈ యువ ముఖ్యమంత్రి ఎందుకూ పనికిరాలేదు.
నన్ను అనుమానించే వాడు నా వాడు కాదు
నన్ను నమ్మే వాడే నా వాడు అవుతాడు, నన్ను అనుమానించేవాడు నా వాడు ఎప్పటికీ కాడు. పవన్ కల్యాణ్ తో స్నేహం అంటే చచ్చేదాకా... పవన్ కల్యాణ్ తో శత్రుత్వం అంటే అవతలివాడు చచ్చేదాకా. పవన్ కల్యాణ్ అంటే... అర్ధరాత్రి వచ్చే 108, మహిళలు రక్షణ కోసం కట్టే రక్షాబంధన్, పెద్దలు గౌరవంగా భుజాన వేసుకునే కండువా... అంటూ పవన్ ఆవేశంగా ప్రసంగించారు.