CPI Narayana: కేజ్రీవాల్‌ను వెంటాడుతున్న కేంద్రం జగన్‌ను మాత్రం ఉపేక్షిస్తోంది: సీపీఐ నారాయణ
- దర్యాప్తు సంస్థలతో రాజకీయ పార్టీలను మోదీ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
- కుంభకోణం ఆరోపణలతో కేజ్రీవాల్ అరెస్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆగ్రహం
- పదేళ్లుగా బెయిల్‌పై బయటున్న వ్యక్తి జగన్ అని వ్యాఖ్య
కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని, ఇతర రాజకీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ప్రధాని మోదీ సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆయన మీడియాతో ముచ్చటించారు.
రూ.100 కోట్ల కుంభకోణం పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రూ.45 వేల కోట్ల అవినీతి కేసులను ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని మాత్రం ఏమీ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి 10 ఏళ్లుగా బెయిల్‌పై బయట ఉండటం ఇదే తొలిసారని అన్నారు. మోదీ, షాలకు జగన్ మోకరిల్లడమే ఇందుకు కారణమని ఆరోపించారు. ప్రస్తుతం సెక్షన్ - 17ఏను అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడిని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
విభజన చట్టంలోని హామీలను పక్కనపెట్టిన కేంద్రాన్ని ఏపీ పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించే ధైర్యం చేయట్లేదని నారాయణ ఆరోపించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి తిరుపతి విశాఖపట్నం, అమరావతిల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.