UNSC: ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన భారత్
- జమ్మూ కశ్మీర్, లడఖ్ భారత్‌లో అంతర్భాగాలని పునరుద్ఘాటించిన భారత్
- భారత అంతర్గత విషయాల్లో మాట్లాడే హక్కులేదని హెచ్చరిక
- సొంత దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల సంగతి చూసుకోవాలని హితబోధ
- ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌లో పాక్, టర్కీ ఆరోపణలకు గట్టి కౌంటర్లు ఇచ్చిన భారత సెక్రటరీ అనుపమ సింగ్
జమ్మూ కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి తన వైఖరిని సుస్పష్టం చేసింది. ఈ విషయంలో దాయాది దేశం పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లడఖ్ భారత్ అంతర్భాగాలని ఐరాసలో భారత సెక్రటరీ అనుపమ సింగ్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధి, సుపరిపాలన కోసం భారత ప్రభుత్వం రాజ్యాంగపరమైన చర్యలను తీసుకుందని, భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడడానికి పాకిస్థాన్‌కు ఎలాంటి అధికారమూ లేదని అనుపమ సింగ్ హెచ్చరించారు. మానవ హక్కుల రికార్డుల పరంగా అధ్వానంగా ఉన్న భారత్ గురించి మాట్లాడడం దారుణమని విమర్శించారు. స్వదేశంలో మైనారిటీల మీద జరుగుతున్న హింస సంగతి చూసుకోవాలని చురకలు అంటించారు. ఆర్థిక, సామాజిక పురోగతి విషయంలో దిక్కుమాలిన పరిస్థితులు ఎదుర్కొంటున్న పాక్.. భారత్ గురించి మాట్లాడడం దారుణమని ధ్వజమెత్తారు.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 55వ రెగ్యులర్ సెషన్‌లో అనుపమ సింగ్ బుధవారం మాట్లాడారు. జమ్మూ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్థాన్, టర్కీ చేసిన ఆరోపణలకు ‘సమాధానం ఇచ్చే హక్కు’లో భాగంగా ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్ గురించి సుదీర్ఘంగా ప్రస్తావించి ఐరాస కౌన్సిల్ ఫోరమ్‌ను పాకిస్థాన్ దుర్వినియోగ పరచిందని మండిపడ్డారు. భారత్‌పై అసత్య ఆరోపణల కోసం మరోసారి ఐరాస వేదికను ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
2023లో పాకిస్థాన్‌లో మైనారిటీ క్రిస్టియన్ కమ్యూనిటీపై దారుణమైన దాడులు జరిగాయని అనుపమ ప్రస్తావించారు. 19 చర్చిలు, 89 మంది క్రైస్తవుల ఇళ్లను తగులబెట్టారని, ఐరాస భద్రతా మండలి గుర్తించిన ఉగ్రవాదులు కూడా పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నారని ఆమె ప్రస్తావించారు. అలాంటి దేశం భారత్‌పై విమర్శలు చేయడం అనైతికమన్నారు. పాకిస్థాన్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దేశ జాతీయ బ్యాలెన్స్ షీట్లు అడుగంటాయని అనుపమ సింగ్ ప్రస్తావించారు.