anurag thakhur: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు... ఎరువులపై రాయితీకి ఆమోదం
- ఐదు రకాల ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీకి ఆమోదం
- గత సీజన్లో ఉన్న ధరలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి వెల్లడి
- పీఎం సూర్య ఘర్ యోజనకు కేబినెట్ ఆమోదం
కేంద్ర కేబినెట్ గురువారం నాటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 ఖరీఫ్ సీజన్లో ఎరువుల రాయితీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐదు రకాల ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీకి ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎరువుల రాయితీ అమలు చేస్తారు. గ్లోబల్ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ, గత సీజన్లో ఉన్న ధరలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో తెలిపారు. 2024లో నత్రజని (ఎన్)పై కిలోకు రూ.47.02, ఫాస్ఫాటిక్ (పి)పై రూ.28.72, పొటాసిక్ (కె) కిలోకు రూ.2.38, సల్ఫర్ (ఎస్)కు రూ.1.89గా సబ్సిడీ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
పీఎం సూర్య ఘర్ యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.75,021 కోట్ల నిధులను కేటాయించింది. 2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే కోటి గృహాలకు సోలార్ విద్యుత్ అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఒక్కో గృహానికి 300 యూనిట్ల విద్యుత్ అందనుంది. సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ ద్వారా పీఎం సూర్య ఘర్ యోజనకు సబ్సిడీని కేంద్రం అందించనుంది. 1kW అయితే రూ.30 వేలు, 2kW అయితే రూ.60 వేలు, 3kW అయితే రూ.78 వేల సబ్సిడీ వస్తుంది.