dharmapuri arvind: రేవంత్ రెడ్డి నుంచి కోమటిరెడ్డి సీఎం కుర్చీని లాక్కుంటారు: బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
- ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం కుర్చీని లాక్కోవడానికి కాచుకొని కూర్చున్నారని వ్యాఖ్య
- లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందో... పోతుందో అన్న అరవింద్
- రేవంత్ రెడ్డి, కవిత కలిసి నిజామాబాద్ అభ్యర్థిని డిసైడ్ చేస్తారన్న అరవింద్
లోక్ సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కుర్చీని రేవంత్ రెడ్డి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాక్కుంటారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం కుర్చీని లాక్కోవడానికి కాచుకొని కూర్చున్నారన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందో... పోతుందో తెలియదని వ్యాఖ్యానించారు. కొమురం భీమ్ క్లస్టర్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇద్దరూ ఒకటేనని, వీరిద్దరు కలిసి నిజామాబాద్ అభ్యర్థిని డిసైడ్ చేస్తారని విమర్శించారు. రైతుబంధు నిధుల నుంచి కోమటిరెడ్డి రూ.2 వేల కోట్లు, పొంగులేటి రూ.3 వేల కోట్లు తమ బిల్లుల కింద తీసుకున్నారని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ 14 సీట్లకు పైగా గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.