Himalayan Region: ఉష్ణోగ్రత మరో 3 డిగ్రీలు పెరిగితే.. 90 శాతం హిమాలయ ప్రాంతాల్లో ఏడాదిపాటు కరవు!
- ఇంగ్లండ్‌లోని ఈస్ట్ అంగ్లియా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
- అధ్యయన వివరాలను ప్రచురించిన క్లైమేట్ చేంజ్ జర్నల్
- పారిస్ ఒప్పంద లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకుంటే దేశంలోని 80 శాతం జనాభా సేఫ్
గ్లోబల్ వార్మింగ్ మరో 3 డిగ్రీలు పెరిగితే హిమాలయ ప్రాంతంలోని దాదాపు 90 శాతం ఏడాదిపాటు తీవ్ర కరవులో కూరుకుపోతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇంగ్లండ్‌లోని ఈస్ట్ అంగ్లియా యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు ‘క్లైమేట్ చేంజ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పారిస్ ఒప్పంద లక్ష్యాలకు అనుగుణంగా గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయగలిగితే దేశంలోని 80 శాతం ప్రజలు వేడికి గురికాకుండా నివారించవచ్చని అధ్యయనం పేర్కొంది. గ్లోబల్ వార్మింగ్ స్థాయి పెరిగే కొద్దీ మానవ, సహజ వ్యవస్థలకు వాతావరణ మార్పుల ప్రమాదాలు జాతీయస్థాయిలో ఎలా పెరుగుతాయో ఈ అధ్యయనం అంచనా వేసింది.
ఇండియా, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనాపై దృష్టిసారించిన 8 అధ్యయనాల సమాహారం.. భూతాపం వల్ల కరవు, వరదలు, పంట దిగుబడి క్షీణత, జీవ వైవిధ్యం తదితర నష్టాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయని అంచనా వేసింది. భూగోళం వేడెక్కడాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేయడం వల్ల దేశంలోని సగం మంది జీవవైవిధ్యానికి ఆశ్రయంగా పనిచేయవచ్చని తెలిపింది.