Harirama Jogaiah: నేను వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కల్యాణే చెప్పాలి: హరిరామజోగయ్య
- టీడీపీతో జనసేన సీట్ల సర్దుబాటును వ్యతిరేకిస్తున్న హరిరామజోగయ్య
- ఇప్పటికే ఓసారి లేఖ
- నాకు సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్లకు ఏం తెలుసు అంటూ పవన్ ఫైర్
- మరోసారి లేఖాస్త్రం సంధించిన హరిరామజోగయ్య
టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లకు ఒప్పుకోవడం పట్ల సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య ఇటీవల పవన్ కల్యాణ్ కు లేఖాస్త్రం సంధించడం తెలిసిందే.
అయితే... నాకు సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్లకు ఏం తెలుసు... జనసేనకు పోల్ మేనేజ్ మెంట్ ఉందా? టీడీపీలా వ్యవస్థాగత బలం ఉందా? బూత్ లెవెల్ లో జనసేనకు బలం ఉందా? అంటూ పవన్ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో, హరిరామజోగయ్య జనసేనాని పవన్ కల్యాణ్ కు మరోసారి లేఖ రాశారు. జనసేన క్షేమం కోరి నేను చేసిన సూచనలు, సలహాలు మీకు నచ్చినట్టు లేవని పేర్కొన్నారు.
"మొన్నటి సభలో నా పేరు పెట్టి ప్రస్తావించకపోయినా... ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారం చూస్తుంటే నన్ను విమర్శించినట్టే అనిపించింది. నేను వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కల్యాణే చెప్పాలి. నా అంచనా ప్రకారం జనసేనకు 40 స్థానాల్లో బలమైన అభ్యర్థులున్నారు. అలాంటప్పుడు 24 సీట్లే తీసుకోవడం ఎందుకని ప్రశ్నించాను... అందుకని వైసీపీ కోవర్ట్ అయ్యానా? మీరు బాగుండాలన్న ఉద్దేశంతోనే బీజేపీని కూడా మీ కూటమిలోకి తీసుకోవాలని సూచించాను... అందుకని వైసీపీ కోవర్ట్ అయ్యానా?" అంటూ హరిరామజోగయ్య ప్రశ్నాస్త్రాలు సంధించారు.
"నన్ను వైసీపీ కోవర్ట్ అని అంటున్నవాళ్లంతా జనసేనలోని వారే... వారంతా టీడీపీ కోవర్టులు కారా? మిమ్మల్ని ఎప్పటినుంచో ప్యాకేజి స్టార్ అంటున్నారు... ఈ ప్రచారాన్ని చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ ఒక్కసారైనా ఖండించారా?
మీ రాజకీయ జీవితాన్ని నిర్వీర్యం చేయడమే టీడీపీ లక్ష్యం... తన రాజకీయ లబ్ది కోసం టీడీపీ మిమ్మల్ని నాశనం చేస్తోంది. ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాలను ఓసారి పరిశీలించండి... మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకోండి.
జనసేనతో పొత్తు లేకుండా బరిలో దిగితే ఓడిపోతామని చంద్రబాబుకు తెలుసు. అందుకే మీతో కలిశాడు. చంద్రబాబు రేపు ఎన్నికలు అయ్యాక మీకు సముచిత స్థానం ఇస్తాడనుకుంటున్నారా? జనసేనను నిర్వీర్యం చేసి లోకేశ్ ను సీఎం చేస్తాడన్న ఆందోళన జనసైనికుల్లో ఉంది.
నా సలహాలు, సూచనలు మీకు నచ్చినా, నచ్చకపోయినా మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మం... చచ్చే వరకు నా వైఖరి ఇలాగే ఉంటుంది. మీకు అధికారంలో తగిన స్థానం కల్పించే వరకు నేను విశ్రమించను" అంటూ హరిరామజోగయ్య తన లేఖలో స్పష్టం చేశారు.