Kodandaram: కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన కోదండరాం

Kodamdaram comments on KCR

  • ఇంజినీర్లతో సంబంధం లేకుండా కాళేశ్వరం డిజైన్లను మార్చారన్న కోదండరాం
  • ఫామ్ హౌస్ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని విమర్శ
  • కేసీఆర్ పాలన లాంటి దుర్మార్గపు పాలనను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్య

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంజినీర్లతో సంబంధం లేకుండా కేసీఆర్ డిజైన్లను మార్చారని విమర్శించారు. తరచూ డిజైన్లు మార్చుకుంటూ పోయారని మండిపడ్డారు. మార్చిన డిజైన్లకు అనుమతులు కూడా తీసుకోలేదని అన్నారు. బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ సరైంది కాదని కేంద్ర జల సంఘం చెప్పిందని.. ఆ హెచ్చరికను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. పంప్ హౌస్ లు మునుగుతాయని హెచ్చరించినా పట్టించుకోవడం లేదని చెప్పారు. డీపీఆర్ ను ఆమోదించకుండానే పనులు ప్రారంభించారని అన్నారు. ఫామ్ హౌస్ కు ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఇలాంటి పనులు చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి, కాగ్ ఇచ్చిన నివేదికలపై మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ పాలన లాంటి దుర్మార్గపు పాలనను ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడలేమని కోదండరామ్ అన్నారు. బంగారు తెలంగాణను సంక్షోభంలోకి నెట్టేశారని మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో దొంగే దొంగ అన్నట్టుగా బీఆర్ఎస్ వైఖరి ఉందని చెప్పారు. కుంగిపోయింది మూడు పిల్లర్లే కదా అని బీఆర్ఎస్ వితండవాదం చేస్తోందని... మూడు పిల్లర్లే కాదు, మూడు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు కుంగిపోయిందని అన్నారు. ప్రాజెక్టు కట్టిన మూడేళ్లకే పిల్లర్లు కుంగి పోయాయని చెప్పారు. మేడిగడ్డ పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో బీఆర్ఎస్ చెప్పాలని అన్నారు. ప్రణాళిక, నిర్వహణ, నాణ్యత, డిజైన్ లోపం వల్లే పిల్లర్లు కుంగిపోయాయని తెలిపారు. భూకంపాలు వచ్చే నేలలో మల్లన్నసాగర్ కట్టారని... దీంతో, మల్లన్న సాగర్ లో నీళ్లు నింపే పరిస్థితి లేదని చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తప్పిదాలపై చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ కు కోదండరాం సవాల్ విసిరారు. ప్రతి ఊరూ తిరిగి బీఆర్ఎస్ బండారాన్ని బట్టబయలు చేస్తామని చెప్పారు. కాళేశ్వం కామధేనువు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలని అన్నారు. అది కామధేనువు కాదని, తెలంగాణ ప్రజల పాలిట గుదిబండ అని విమర్శించారు.

  • Loading...

More Telugu News