VV Lakshminarayana: 'జై భారత్' పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్
- ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- సీఎం నివాసం ముట్టడికి పిలుపు.. అడ్డుకున్న పోలీసులు
- ఢిల్లీ వెళ్లి పోరాడేందుకు సీఎంను కూడా రమ్మని పిలవడానికి వచ్చామన్న లక్ష్మీనారాయణ
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం ఎందుకు చేయరంటూ లక్ష్మీనారాయణ సీఎం జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఇవాళ తాడేపల్లిలో సీఎం ఇంటి ముట్టడికి బయల్దేరిన లక్ష్మీనారాయణ, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, లక్ష్మీనారాయణకు మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే, పోలీసులు ఆయనను వాహనంలోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు.
అంతకుముందు, లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతోందని, ఇప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తీసుకురావడానికి బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రెండు కూడా విఫలమయ్యాయని అన్నారు.
ఇవాళ తాము ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి రాలేదని, ప్రత్యేక హోదా సాధన కోసం అందరం కలిసి పోరాడుదాం రండి అని చెప్పడానికే వచ్చామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఏ విధంగా రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారో, అన్ని పార్టీలను కలుపుకుని మనం కూడా వెళదాం అని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన ద్వారా రాష్ట్రంలోని యువతకు, భావితరాలకు మనమందరం మార్గదర్శకులుగా ఉందాం అని అన్నారు.
"కలిసి పోరాడుదాం అని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, ప్రతిపక్షాన్ని అడుగుతున్నాం, జనసేన పార్టీని అడుగుతున్నాం... సీపీఐ, సీపీఎం మాతోనే ఉన్నాయి... విద్యార్థి నాయకులు ఉన్నారు... వీళ్లందరితో కలిసి ఢిల్లీ వెళదాం అంటున్నాం కానీ... మేం ఒక్కరిమే వెళతాం అనడంలేదు. ఢిల్లీ వెళదాం రండి అని ముఖ్యమంత్రిని అడగడానికే ఇక్కడికి వచ్చాం... మీకు అడగడానికి నోరు లేకుంటే మేం అడుగుతాం ప్రధానమంత్రిని" అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
కాగా, ఈ ముట్టడి కార్యక్రమంలో లక్ష్మీనారాయణతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.