Sajjala Ramakrishna Reddy: సునీత ఎవరి ప్రతినిధో ఇవాళ తెలిసిపోయింది: సజ్జల
- ఢిల్లీలో వివేకా కుమార్తె సునీత మీడియా సమావేశం
- జగన్ పైనా విచారణ జరగాలని డిమాండ్
- వైసీపీకి ఓటేయొద్దని పిలుపు
- ఇవాళ్టితో సునీత ముసుగు తొలగిపోయిందన్న సజ్జల
తన తండ్రి వివేకా హత్య కేసులో సీఎం జగన్ ను కూడా విచారించాలని, విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని డాక్టర్ సునీతా రెడ్డి ఇవాళ ఢిల్లీలో మీడియా ఎదుట పేర్కొన్నారు. అవినాశ్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడాల్సిందేనని అన్నారు. జగన్ పార్టీకి ఓటేయొద్దని పిలుపునిచ్చారు.
దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇవాళ్టితో సునీత ముసుగు తొలగిపోయిందని, ఆమె ఎవరి ప్రతినిధో నేటితో స్పష్టమైందని అన్నారు. ఇవాళ సునీత ఎవరికి కృతజ్ఞతలు చెప్పారో అందరూ చూశారని, చంద్రబాబు చేతిలో సునీత కీలుబొమ్మలా మారారని సజ్జల విమర్శించారు.
నాడు వివేకా హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా వున్నది చంద్రబాబేనని, ఇది నాలుగైదు రోజుల్లో తేలిపోవాల్సిన కేసు అంటున్నప్పుడు... సునీత ప్రశ్నించాల్సింది చంద్రబాబునే కదా? అని సజ్జల వ్యాఖ్యానించారు. తండ్రిని అంతమొందించిన వ్యక్తిని సునీత అక్కున చేర్చుకుంటున్నారని, ఇదంతా రాజకీయ కుట్ర కాదా? అని ప్రశ్నించారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి చంద్రబాబు, బీటెక్ రవి కారణం... వాళ్లతో ఇప్పుడు సునీత జట్టు కట్టారు... తాను ఎవరి ప్రతినిధినో సునీత చెప్పకనే చెప్పారు' అని సజ్జల విమర్శించారు. అసలు, వివేకా హత్యలో సునీత కుటుంబ సభ్యులు కూడా అనుమానిత వ్యక్తులేనని పేర్కొన్నారు.