Mallu Bhatti Vikramarka: ఎవరినీ మోసం చేయాలనే ఆలోచన లేదు... పదేళ్లు భ్రమలు కల్పించి పబ్బం గడపాలనే ఉద్దేశ్యం అసలేలేదు: మల్లు భట్టివిక్రమార్క
- కాంగ్రెస్ మరో వందేళ్లు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించి ప్రజలకు అండగా నిలుస్తుందన్న ఉపముఖ్యమంత్రి
- కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం... చేసేదే చెబుతామని వ్యాఖ్య
- ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేశామని వెల్లడి
- తాను ఈ స్థాయిలో ఉండటానికి మధిర నియోజకవర్గ ప్రజలే కారణమన్న విక్రమార్క
ఎవరినీ మోసం చేయాలన్న ఆలోచన తమకు లేదని, పదేళ్లు ప్రజలకు భ్రమలు కల్పించి పబ్బం గడపాలనే ఉద్దేశ్యం అంతకంటే లేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... వందేళ్ళకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ మరో వందేళ్లు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించి ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రజల్ని మోసం చేసి పాలన సాగిస్తే రానున్న రోజులలో ఇంటికి పంపిస్తారని, ప్రజలకు అంకితమై పని చేయాలన్నది కాంగ్రెస్ లక్ష్యమని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం... చేసేదే చెబుతామని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యాంలో ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే పేదలకు 200 యూనిట్ల విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. రూ.10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఆర్థికంగా నిలబెట్టేందుకు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడ్డారని... కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు.
ప్రతి బిడ్డ చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ నెరవేర్చుతామన్నారు. మధిర నియోజకవర్గ ప్రజల ఓటుకు గౌరవం తెచ్చే విధంగా పని చేస్తానని భట్టివిక్రమార్క అన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన నియోజకవర్గ ప్రజలే అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వంలో మంత్రులుగా కంకణబద్ధులై పని చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిందని... కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.