Devineni Uma: జగన్ పూర్తిగా దిగజారిపోయారు: దేవినేని ఉమ
- చిలకలూరిపేటలో వైసీపీకి అభ్యర్థి దొరకడం లేదన్న దేవినేని ఉమ
- ప్రత్తిపాటి పుల్లారావుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు
- తప్పుడు కేసులకు టీడీపీ శ్రేణులు భయపడవని వ్యాఖ్య
టీడీపీ, జనసేనల జెండా సభ విజయవంతం అయిన తర్వాత సీఎం జగన్ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మీద పోటీ చేసే అభ్యర్థి వైసీపీకి దొరకడం లేదని... దీంతో, ఆయన పట్ల కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే జగన్ పూర్తిగా దిగజారిపోయి ఆయన కుటుంబ సభ్యులపై పడ్డాడని విమర్శించారు.
ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ఢిల్లీ నుంచి వస్తుండగా ఆయనను అరెస్ట్ చేశారని దేవినేని ఉమా మండిపడ్డారు. వివిధ పోలీస్ స్టేషన్లకు ఆయనను తిప్పారని అన్నారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లను పెట్టి దుర్మార్గపు చర్యలకు తెరతీశారని చెప్పారు.
మరో 15 రోజుల్లో ఎలెక్షన్ నోటిఫికేషన్ రాబోతోందని... ఈలోగా వీలైనంత ఎక్కువ మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కేసులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భయపడరని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఇలాంటి తప్పుడు కేసులను ఎదుర్కొంటామని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలకు సమాధానాలు చెప్పలేక... జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని దుయ్యబట్టారు.