BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళుతుండగా పగిలిపోయిన బస్సు టైరు... వీడియో ఇదిగో!
- జనగామ జిల్లా లింగాల గణపురం ఆర్టీసీ కాలనీ సమీపంలో బైపాస్ వద్ద పగిలిన టైరు
- ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న ప్రజాప్రతినిధులు
- టైరును మార్చిన తర్వాత తిరిగి మేడిగడ్డకు బయలుదేరిన బస్సు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 'ఛలో మేడిగడ్డ' కార్యక్రమానికి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు టైరు పగిలిపోయింది. దీంతో బస్సులో కూర్చున్న ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బస్సు టైరును మార్చిన తర్వాత తిరిగి మేడిగడ్డకు బయలుదేరారు. ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులతో కూడిన బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరింది. జనగామ జిల్లాలోని లింగాల గణపురం ఆర్టీసీ కాలనీ సమీపంలో బైపాస్ వద్ద బస్సు టైరు పగిలింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై ప్రభుత్వం విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నేతల ఆరోపణలు అవాస్తవమని... ప్రాజెక్టులోని వాస్తవాలను ప్రజలకు చెబుతామంటూ బీఆర్‌ఎస్ 'ఛలో మేడిగడ్డ'ను చేపట్టింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, శాసనమండలి, పార్లమెంట్ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరారు. వారితోపాటు సాగునీటిరంగ నిపుణులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు.