Komatireddy Venkat Reddy: రాజీనామా చేసి రావాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్... ప్రతి సవాల్ చేసిన కోమటిరెడ్డి
- కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే సిరిసిల్ల నుంచి ఆయనపై పోటీ చేస్తానని కోమటిరెడ్డి ప్రతిసవాల్
- సిరిసిల్లలో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కోమటిరెడ్డి
- కేటీఆర్ ఓడిపోతే పార్టీ మూసేసుకుంటానని కేసీఆర్ చెప్పాలన్న కోమటిరెడ్డి
- పార్లమెంట్ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి బీజేపీయేనన్న మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి ప్రతిసవాల్ విసిరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మనమిద్దరం రాజీనామా చేసి మల్కాజిగిరి నుంచి లోక్ సభకు పోటీ చేద్దామా? అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై మంత్రి కోమటిరెడ్డి శుక్రవారం స్పందించారు. కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని, అప్పుడు ఇద్దరం అదే నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామని ప్రతి సవాల్ విసిరారు. సిరిసిల్లలో కేటీఆర్‌పై తాను గెలిచి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను కనుక ఓడిపోతే ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని... మరి కేటీఆర్ ఓడిపోతే పార్టీని మూసేసుకుంటానని కేసీఆర్ చెప్పగలరా? అని సవాల్ చేశారు.
మీడియాతో ఉత్తమ్, కోమటిరెడ్డి చిట్ చాట్
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి బీజేపీయేనని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం వారు మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ ప్రత్యర్థి కానే కాదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని తాము కోరామని... ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తే 4 లక్షలకు పైగా మెజార్టీ వచ్చే బాధ్యతను తీసుకుంటామన్నారు. తమకు రైతుబంధు నిధులు పెద్ద మొత్తంలో వచ్చాయన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలను వారు ఖండించారు. రైతు బంధు నిధులపై ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తాము ఆస్తులు పోగొట్టుకున్నామని పేర్కొన్నారు.