SV Satish Kumar Reddy: వైసీపీలో చేరిన సీఎం జగన్ మాజీ ప్రత్యర్థి
- సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సతీశ్ కుమార్ రెడ్డి
- 2014, 2019లో పులివెందులలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైనం
- రెండు సార్లూ జగన్ చేతిలో పరాజయం
- అంతకుముందు వైఎస్ చేతిలోనూ రెండు పర్యాయాలు ఓటమి
- 2020లో టీడీపీకి గుడ్ బై
పులివెందుల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో సీఎం జగన్ చేతిలో ఓటమిపాలైన ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డి నేడు వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో సతీశ్ కుమార్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సతీశ్ కుమార్ రెడ్డికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
2014, 2019 ఎన్నికల్లో సతీశ్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పులివెందులలో సీఎం జగన్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2004, 2009లో సతీశ్ కుమార్ రెడ్డి దివంగత వైఎస్సార్ చేతిలో ఓడిపోయారు.
2011లో టీడీపీ తరఫున కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలికి డిప్యూటీ చైర్మన్ గానూ వ్యవహరించారు. ఆయన 2020లో టీడీపీకి రాజీనామా చేశారు.