sridhar babu: కాళేశ్వరం ప్రాజెక్టు సురక్షితం కాదు... కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్
- లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి, భూపాలపల్లి ప్రాంతాల్లో ఒక్క చుక్క నీరు రాలేదని విమర్శ
- మేడిగడ్డకు మరమ్మతులు నిపుణుల సూచనల మేరకు జరుగుతాయన్న మంత్రి
- ఎవరి సలహాలపైనో మరమ్మతులు చేపడితే ప్రాజెక్టు మళ్లీ కుంగిపోతుందన్న శ్రీధర్ బాబు
కాళేశ్వరం ప్రాజెక్టు సురక్షితం కాదని తాము మాత్రమే కాదని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులే చెప్పారని... దీనికి రూపకల్పన చేసిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో శనివారం ఆయన గృహజ్యోతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి, భూపాలపల్లి ప్రాంతాల్లో ఒక్క చుక్క నీరు అందలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా మేడిగడ్డను సందర్శించారని... ఈ ప్రాజెక్టు సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారన్నారు.
మేడిగడ్డకు మరమ్మతులు నిపుణుల సూచనల మేరకు జరుగుతాయన్నారు. వాళ్లు చెప్పారనో... వీళ్లు చెప్పారనో... అలాంటి వారి సలహాలపై మరమ్మతులు చేపడితే ప్రాజెక్టు మళ్లీ కుంగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజినీర్లు, నిపుణుల సూచనల కోసం తమ ప్రభుత్వం వేచి చూస్తోందన్నారు. తాము అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా పూర్తి కాలేదని, కానీ అప్పుడే ఆరు గ్యారెంటీల్లో పలు హామీలను అమలు చేసినట్లు తెలిపారు. హామీలు అమలు చేసిన విషయం బీఆర్ఎస్ నేతల కళ్లకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.