Indian Railways: రైల్వే ప్రయాణికులకు రూ.100 ఖర్చయితే రూ.45 మాత్రమే వసూలు చేస్తున్నాం: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
- ప్రతి వ్యక్తికి సగటున 55 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడి
- ప్రపంచస్థాయి సౌకర్యాలతో అమృత్ భారత్‌ను తీసుకు వస్తున్నట్లు చెప్పిన కేంద్రమంత్రి
- రాబోయే కొన్నేళ్లలో 1000 రైళ్లను పట్టాలెక్కిస్తామన్న కేంద్రమంత్రి
రైల్వే ప్రయాణికులకు 55 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం తెలిపారు. రైల్వే ద్వారా ప్రతి సంవత్సరం 700 కోట్ల మంది ప్రయాణిలను గమ్యస్థానాలకు చేరుస్తున్నామన్నారు. ఒక్కో వ్యక్తిని తీసుకువెళ్లేందుకు రూ.100 ఖర్చయితే... రూ.45 మాత్రమే వసూలు చేస్తున్నామన్నారు. రైల్వేలో ప్రయాణించే ప్రతి వ్యక్తికి సగటున 55 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు.
మనం తీసుకు రానున్న అమృత్ భారత్ రైలు ప్రపంచస్థాయి సౌకర్యాలతో కూడుకొని ఉంటుందన్నారు. రాబోయే కొన్నేళ్లలో 1000 అమృత్ భారత్ రైళ్లను పట్టాలెక్కిస్తామన్నారు. రూ.454తో వెయ్యి కిలో మీటర్లు ప్రయాణించవచ్చునన్నారు. గంటకు 250 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు తయారీ పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ వంతెన, కోల్‌కతా మెట్రో కోసం అండర్ వాటర్ టన్నెల్‌ను నిర్మించినట్లు తెలిపారు.
మార్చి 6న కోల్‌కతాలో నిర్మించిన భారతదేశ తొలి అండర్ రివర్ టన్నెల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారన్నారు. కోల్‌కతా మెట్రో పనులు 1970లో ప్రారంభం కాగా గత పదేళ్లలోనే భారీ పురోగతి సాధించినట్లు తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న దేశానికి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాని మోదీ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.