Anant Ambani: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. అతిథులకు సమకూరుస్తున్న అత్యంత ఖరీదైన సేవలు ఇవే!
- జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు
- ప్రపంచం నలుమూలల నుంచి హాజరవుతున్న అతిరథ మహారథులు
- అతిథుల కోసం వందలాది రుచులతో వంటకాలు
- ముంబై, ఢిల్లీ నుంచి జామ్‌నగర్‌కు చార్టెడ్ విమానాలు
- అక్కడి నుంచి వేడుకకు తరలించేందుకు విలాసవంతమైన కార్లు
ముకేశ్-నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు కొన్ని రోజులుగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారథులు ఈ వేడుకకు హజరయ్యారు. వీరిలో బాలీవుడ్ సెలబ్రిటీలు, బిలియనీర్లు ఉన్నారు. గ్రామీ అవార్డు విన్నింగ్ సింగర్ రిహన్నా ప్రదర్శనతో ఈ వేడుక ప్రారంభమైంది. ఈ షో కోసం ఆమెకు ఏకంగా 9 మిలియన్ డాలర్లు చెల్లించినట్టు సమాచారం.
ఈ మూడు రోజుల వేడుకకు హాజరయ్యే అతిథుల కోసం అంబానీ కుటుంబం ఖరీదైన సేవలు అందిస్తోంది. ముంబై, ఢిల్లీ నుంచి జామ్‌నగర్‌కు చార్టెడ్ విమానాలు నడుపుతోంది. వరల్డ్ క్లాస్ చెఫ్‌లు, వార్డ్‌రోబ్ సర్వీసులతోపాటు అతిథులను తరలించేందుకు లగ్జరీ కార్లు ఏర్పాటు చేశారు. రిహన్నా, అరిజిత్ సింగ్, దిల్జీత్ దోసాంజ్, అజయ్-అతుల్ ప్రదర్శనలు సరేసరి.
ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. వారికి విభిన్న రుచులు అందించేందుకు ఇండోర్‌లోని జర్దిన్ హోటల్ నుంచి 21 మంది చెఫ్‌లను రప్పించారు. వారు సిద్ధం చేయబోయే వంటకాల్లో జపనీస్, థాయ్, మెక్సికన్, పార్సీ థాలి వంటివి ఉన్నాయి. అల్పాహారం కోసం 75 వంటకాలు, లంచ్ కోసం 225 రకాలు, డిన్నర్ కోసం 275 రకాలు, లేట్ నైట్ కోసం 85 విభిన్న వంటకాలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు, ఇండోర్ సంప్రదాయ వంటకాల కోసం ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ప్రీవెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరయ్యే అతిథుల కోసం లాండ్రీ, ఖరీదైన దుస్తులు, చీరలు కట్టేవారు, హెయిర్ స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టులు అందుబాటులో ఉన్నారు. జామ్‌నగర్ విమానాశ్రయం నుంచి వేడుకలు జరిగే గ్రాండ్ రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్‌కు అతిథులను తరలించేందుకు రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ వంటి విలాసవంతమైన కార్లను సిద్ధం చేశారు.
ఇక, వేడుకకు హాజరవుతున్న వారిలో గ్లోబల్ పర్సనాలిటీలైన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఐగర్, అడోబ్ సీఈవో శంతను నారాయన్ సహా పలువురు ప్రముఖులతోపాటు బాలీవుడ్ నుంచి షారూఖ్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, సల్మాన్‌ఖాన్ వంటివారు వేడుకకు హాజరవుతున్నారు.