Soyam Bapurao: టికెట్ ఇవ్వకుంటే నా దారి నాదే.. బీజేపీ అధిష్ఠానానికి సోయం బాపూరావు ఆల్టిమేటం

MP Soyam Bapurao Ultimatum To BJP HighCommand About Adilabad Lok Sabha Ticket

  • ఆదిలాబాద్ లో తన సొంత బలంతో గెలిచానన్న ఎంపీ
  • బీజేపీ తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి
  • తన బలం బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుందని వ్యాఖ్య

ఆదిలాబాద్ లో బీజేపీకి ఏ బలం లేని సమయంలో తన సొంత బలంతో గెలిచానని ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. తన బలం, బలగం అవసరమనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుందని, లేదంటే తన దారి తాను చూసుకుంటానని అధిష్ఠానానికి హెచ్చరికలు పంపించారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కొంతమంది కుట్రలు పన్నుతున్నారని, తొలి జాబితాలో తన పేరు లేకపోవడానికి వారే కారణమని ఆరోపించారు. ఆదివాసీ నేతనైన తనకు టికెట్ దక్కితే మరోసారి గెలుస్తాననే భయంతో పార్టీలో కొందరు నేతలు భయపడుతున్నారని చెప్పారు. 

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలోకి దింపనున్న 9 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్ఠానం శనివారం ప్రకటించింది. మరో ఎనిమిది స్థానాలలో అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. ఈ తొలి జాబితాలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేరులేదు. దీంతో బాపూరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు టికెట్ రాకుండా పార్టీలో కొంతమంది పెద్దలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అయితే, తాను కొమ్మను నమ్ముకున్న పక్షిని కాదని, సొంత రెక్కలపై ఎదిగిన లీడర్ నని వ్యాఖ్యానించారు. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆదిలాబాద్ లోక్ సభ స్థానానికి తాను పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ లో గెలిచేది కూడా తానేనని, ఏ పార్టీ నుంచనేది బీజేపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రెండో జాబితాలో తన పేరు లేకుంటే తన దారి తాను చూసుకుంటానని సోయం బాపూరావు తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News