Telangana Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. ఎప్పటి నుంచంటే..?
- ఈ నెల 15 నుంచి స్కూళ్లు మధ్యాహ్నం వరకే
- ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 కు క్లోజ్
- ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ?
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిబ్రవరి చివరి వారం నుంచే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన మేరకు.. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఈ నెల 15 నుంచి ఒంటిపూట మాత్రమే తరగతులు నిర్వహించనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బోధన.. ఆ తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించి, ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించనున్నట్లు సమాచారం.
పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో..
పదో తరగతి పరీక్షా కేంద్రాలలో మాత్రం మధ్యాహ్నం తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం పూట పరీక్ష నిర్వహించి, మధ్యాహ్నం పిల్లలకు క్లాసులు చెప్పనున్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన తరువాత తరగతులను నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు పూర్తయిన తరువాత తిరిగి ఉదయం వేళ స్కూల్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.