Tellam Venkata Rao: సీఎం రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం భేటీ.. గులాబీ పార్టీలో కలవరం
- ఖమ్మం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం
- కాంగ్రెస్‌లో చేరుతారని కొంతకాలంగా ప్రచారం
- కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఇంటికి
- ఆయన వెంటనే మంత్రి పొంగులేటి కూడా
లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతల నుంచి కిందిస్థాయి నాయకుల వరకు అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి ‘చేయి’ అందుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, వీరి భేటీ గులాబీ పార్టీలో కలవరం రేపింది.
కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన రేవంత్‌తో భేటీ అయ్యారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన సీఎంను కలవడం చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో తొమ్మిదింటిని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తెల్లం కాంగ్రెస్‌లో చేరితే ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం కనుమరుగైనట్టే.