Times Square: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో గ్రనేడ్ కలకలం
- క్యాబ్ లో బాంబును గుర్తించిన డ్రైవర్..
- సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు
- బాంబ్ స్క్వాడ్ కారును అడ్డుకున్న యాంటీ ఇజ్రాయెల్ నిరసనకారులు
- పదుల సంఖ్యలో నిరసనకారుల అరెస్ట్
- వీధులను క్లోజ్ చేసి బాంబును నిర్వీర్యం చేసిన బాంబ్ స్క్వాడ్
న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో శనివారం బాంబు కలకలం సృష్టించింది. ఓవైపు యాంటీ ఇజ్రాయెల్ నిరసనకారుల ప్రదర్శన, మరోవైపు కారులో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ రావడంతో న్యూయార్క్ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఘటనాస్థలానికి వెళ్లే క్రమంలో బాంబ్ స్క్వాడ్ కారును నిరసనకారులు అడ్డుకోవడంతో టెన్షన్ నెలకొంది. నిరసనకారులు ఎక్కువ మంది ఉండడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. ఆ తర్వాత కారుకు అడ్డుపడుతున్న వాళ్లను పక్కకు లాగేస్తూ ముందుకెళ్లారు. ఉబర్ కారులో గ్రనేడ్ ను గుర్తించి, నిర్వీర్యం చేసినట్లు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. అదేవిధంగా పోలీస్ కారును అడ్డుకున్న నిరసనకారులను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపింది.
అసలేం జరిగిందంటే..
న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో స్ట్రీట్ నెంబర్ 42 వద్ద ఓ ప్యాసింజర్ ను దింపేసిన ఉబర్ డ్రైవర్.. ప్రయాణికుడు వెళ్లిపోయాక కారు వెనక సీట్లో బాంబును చూశాడు. వెంటనే ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి బయలుదేరారు. అయితే, గాజాపై ఇజ్రాయెల్ దాడిని తప్పుబడుతూ టైమ్స్ స్క్వేర్ వద్ద కొంతమంది నిరసన చేస్తున్నారు. అటుగా వచ్చిన బాంబ్ స్క్వాడ్ కారును వీరు అడ్డుకున్నారు. కారు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో పోలీసులు అదనపు బలగాలను పిలిపించి, రోడ్డును క్లియర్ చేశారు. ఈ సందర్భంగా బాంబ్ స్క్వాడ్ కారును అడ్డుకున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సెవెంత్ ఎవెన్యూలో..
బాంబు ఉన్న ఉబర్ కారు టైమ్స్ స్క్వేర్ లోని సెవెంత్ ఎవెన్యూలో రోడ్ నెంబర్ 42 లో ఉంది. దీంతో ఆ రోడ్డును బ్లాక్ చేసిన పోలీసులు.. కారులోని గ్రనేడ్ ను జాగ్రత్తగా నిర్వీర్యం చేశారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముప్పులేదని నిర్ధారించుకున్నాక ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
ఎన్ పీ వైడీ ట్వీట్..
‘‘అందరికీ హ్యాపీ సాటర్ డే.. నిరసన తెలిపేందుకు బాంబ్ స్క్వాడ్ కారును అడ్డుకోవడం మంచి ఐడియా అని భావించిన కొంతమందికి మాత్రం ఈ రోజు అంత మంచిరోజు కాదు. వారు ఉండాల్సిన చోటుకే వాళ్లను పంపించాం. ఈ వారాంతాన్ని వారు జైలులో గడుపుతున్నారు. వాళ్లకు అదే కరెక్ట్ ప్లేస్’’ అంటూ న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ (ఎన్ పీ వై డీ) ట్వీట్ చేసింది.