Mallika Garg: తిరుపతికి తొలి మహిళా ఎస్పీ వచ్చిందనుకున్నారు... కానీ మూడు వారాలకే విజయవాడకు బదిలీ
- ఇటీవలే తిరుపతి ఎస్పీగా బదిలీ అయిన మల్లికా గార్గ్
- తాజాగా విజయవాడ సీఐడీ ఎస్పీగా బదిలీ
- గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసిన మల్లికా గార్గ్
ఇటీవలే తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మల్లికా గార్గ్ కేవలం మూడు వారాల వ్యవధిలోనే మరో చోటికి బదిలీ అయ్యారు. ఆమెను విజయవాడ సీఐడీ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా ఉన్న కృష్ణకాంత్ ను తిరుపతికి బదిలీ చేశారు.
కాగా, ఇటీవల బదిలీల్లో ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న మల్లికా గార్గ్ ను తిరుపతికి పంపించారు. తిరుపతి జిల్లాకు తొలి మహిళా ఎస్పీ వచ్చిందనుకున్నారు. ఆమె కూడా... సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతానని, రాబోయే ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా సేవలు అందిస్తానని ప్రకటించారు. కానీ ఆమె తన పోస్టులో కుదురుకునే లోపే బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
మల్లికా గార్గ్ 2015 క్యాడర్ ఐపీఎస్ అధికారిణి. అంతర్ క్యాడర్ బదిలీల్లో భాగంగా ఆమె పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీకి వచ్చారు. తొలుత కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. 2021 జులైలో ప్రకాశం జిల్లా ఎస్పీగా వచ్చారు. నిజాయతీగా వ్యవహరిస్తారని, నేరస్తుల పాలిట కఠినంగా వ్యవహరిస్తారని ఆమెకు పేరుంది.