Harsha Kumar: కోడికత్తి శ్రీను ఎందుకు దాడి చేశాడంటే...!: మాజీ ఎంపీ హర్షకుమార్

Former MP GV Harsha Kumar talks about Kodikathi Srinu

  • ఇటీవల బెయిల్ పై విడుదలైన కోడికత్తి శ్రీను
  • నేడు మాజీ ఎంపీ హర్షకుమార్ తో భేటీ
  • శ్రీనుతో కలిసి తాను 48 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నానన్న హర్షకుమార్
  • అతడిలో క్రిమినల్ మనస్తత్వం లేదని వెల్లడి

కోడికత్తి కేసులో ఇటీవల బెయిల్ పై విడుదలైన జనుపల్లి శ్రీను నేడు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ను కలిశాడు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కోడికత్తి శ్రీనుకు శాలువా కప్పి సన్మానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ, కోడికత్తి శ్రీను జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి తన వద్దకు వచ్చాడని వెల్లడించారు. తాను, శ్రీనివాస్ కలిసి 48 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నామని హర్షకుమార్ తెలిపారు. అప్పుడు తనకు శ్రీనివాస్ చాలా సన్నిహితం అయిపోయాడని వివరించారు. 

"శ్రీను క్యారెక్టర్ ను నేను చాలా దగ్గరగా చూశాను. అతని మంచితనం, ప్రవర్తన గమనించాను. ఎలాంటి క్రిమినల్ మనస్తత్వం గానీ, కుట్రపూరిత వైఖరి గానీ లేదు. ఇలా ఎందుకు చేశావ్ శ్రీనూ అంటే... దళితుల సమస్యలను పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే దాడి చేశానని చెప్పాడు. ఒక లెటర్ రాశాను సర్... ఆ లేఖ సంచలనం సృష్టించాలనుకున్నాను సర్ అని చెప్పాడు. అంతేకాదు, నాకు జగన్ అంటే చాల అభిమానం సర్... నేను ఆయన అభిమానిని అని జగన్ కు కూడా తెలుసు అన్నట్టుగా చెప్పాడు. అంతేతప్ప, శ్రీనుకు జగన్ ను చంపాలన్న ఉద్దేశం లేదు. అంతవరకు స్పష్టంగా తెలుస్తోంది" అని హర్షకుమార్ వివరించారు.

  • Loading...

More Telugu News